హైదరాబాద్లో పండుగ పూట ప్రమాదాలు..సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ మృతి.. విలేకరికి తీవ్ర గాయాలు

  • జీడిమెట్ల పరిధిలో ఢీకొట్టుకున్న రెండు బైకులు
  • సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​మృతి
  • చందానగర్ ​పరిధిలో కరెంట్​పోల్​ను ఢీకొట్టి జిమ్ ​ట్రైనర్ కన్నుమూత 
  • ఎస్సార్​నగర్​లో విలేకరికి తీవ్ర గాయాలు 

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పీఎస్​పరిధిలో రెండు బైక్​లు ఢీకొని ఓ సాఫ్ట్ వేర్ ​ఇంజినీర్​ చనిపోయాడు. క్రిష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడికి చెందిన మలిసెట్టి దేవహర్ష (26) చింతల్​గణేశ్​నగర్​లో ఉన్న లక్ష్మీగణేశ్​ అపార్ట్​మెంట్స్​లో ఉంటూ  గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్​వేర్ ​కంపెనీలో పని చేస్తున్నాడు. 

మంగళవారం రాత్రి బయటకు వెళ్లాడు., ఐడీపీఎల్ ​క్రాస్ ​రోడ్డు నుంచి కుత్బుల్లాపూర్​ క్రాస్​రోడ్ వైపు వస్తూ కేఎఫ్​సీ ఎదురుగా యూటర్న్​ తీసుకుంటున్నాడు. అదే టైంలో పద్మానగర్​ఫేజ్​-2కి చెందిన ప్రవీణ్​రెడ్డి బైక్​పై వస్తున్నాడు. ఈ ఇద్దరి వాహనాలు ​ఢీకొట్టుకోవడంతో దేవహర్ష  అక్కడికక్కడే చనిపోయాడు. ప్రవీణ్​రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. దేవ హర్ష, ప్రవీణ్​రెడ్డి ఇద్దరూ హెల్మెట్​పెట్టుకోలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గడ్డం మల్లేశ్​ తెలిపారు. 

వెళ్లొద్దన్నా వినలే...

చందానగర్ : ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి మద్యం తాగి అర్ధరాత్రి బైక్ పై ఓవర్ స్పీడ్ తో ఇంటికి వస్తూ కరెంట్ పోల్ ని ఢీకొట్టడంతో ఓ జిమ్ ట్రైనర్ చనిపోయాడు. బీహెచ్ఈఎల్ టౌన్​షిప్​లో ఉండే ప్రాంక్లిన్ ఫిలిప్స్ (27) జిమ్ ట్రైనర్. సంక్రాంతి సందర్భంగా కోకా పేట్​లోని తన ఫ్రెండ్స్​ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి మందు తాగాడు. 

అర్ధరాత్రి ఫ్రాంక్లిన్ తాను ఇంటికి వెళ్తానని చెప్పగా ఫ్రెండ్స్​ వారించారు. తాము డ్రాప్ చేస్తామని చెప్పిన వినకుండా బంధువుల ఇంట్లో హల్దీ ఉందని కోకాపేట్​నుంచి బైక్ పై బీహెచ్ఈఎల్ కి బయలుదేరాడు. మద్యం మత్తు, బైక్ ని స్పీడ్ గా డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి నల్లగండ్ల అపర్ణ సరోవర్ వద్ద కరెంట్​పోల్​ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడు. అతడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.

రిపోర్టర్​కు తీవ్ర గాయాలు 

పంజాగుట్ట : ఎస్సార్​నగర్ ​పీఎస్​పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ఓ పత్రిక రిపోర్టర్ ​తీవ్రంగా గాయపడ్డాడు. యూసుఫ్​గూడకు చెందిన రమేశ్​ఓ పత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా మంగళవారం రాత్రి ఎస్సార్​నగర్​లో స్వీట్స్ ​కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని టూ వీలర్ ​ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేశ్ ​తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అమీర్​పేట్​లోని ఓ ప్రైవేట్​దవాఖానకు తరలించారు. ఢీకొట్టి వెళ్లిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని సీఐ శ్రీనాథ్​రెడ్డి తెలిపారు.