- పెద్దపల్లి జిల్లాలో కల్వర్టును ఢీకొట్టిన కారు
- దంపతులతో పాటు మరో వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు
- మృతులంతా సిద్దిపేటకు చెందిన వారిగా గుర్తింపు
- నారాయణపేట జిల్లాలో బస్సును ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి
సుల్తానాబాద్, వెలుగు : నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ కారు స్టీరింగ్‌ను వదిలేయడంతో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేటకు చెందిన భార్యాభర్తలు ఆకుల కనకయ్య (69), ఆకుల తార (63) తమ కుటుంబ సభ్యులైన శ్రీనివాస్, ఆర్యన్, మాన్విత, జంగటి జనార్దన్ (45), రమాదేవి, మనోజ్‌కుమార్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున ఎర్టిగా కారులో కాళేశ్వరం బయలుదేరారు. కాట్నపల్లి వద్దకు రాగానే కారు డ్రైవర్ బాల్‌రెడ్డి నిద్రమత్తులో స్టీరింగ్‌ను వదిలేశాడు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని కరీంనగర్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు కనకయ్య, తార అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ మధ్యాహ్నం జనార్దన్ సైతం చనిపోయాడు. మిగతా వారికి ట్రీట్మెంట్ కొనసాగుతుండగా ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని
తెలుస్తోంది.
బస్సును ఢీకొట్టిన బైక్
ఊట్కూర్, వెలుగు : నారాయణపేట జిల్లా ఊట్కూర్ పట్టణంలోని ఊర లక్ష్మమ్మ ఆలయ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... ఊట్కూరుకు చెందిన ఇర్ఫాన్ (17), శంషుద్దీన్, షాబాద్ బుధవారం బైక్‌పై వెళ్తున్నారు. ఊర లక్ష్మమ్మ ఆలయ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఎదురుగా వచ్చిన మరో బస్సును ఢీకొట్టారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు నారాయణపేట జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. ఇర్ఫాన్, షాబాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఇర్ఫాన్ చనిపోయాడు. షాబాద్‌లో హైదరాబాద్, శంషుద్దీన్ నారాయణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై
తెలిపారు.