ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవట్లే!

  • ఓవర్​ లోడింగ్​ తో బోల్తా పడుతున్న జామాయిల్, సుబాబుల్​ ​ట్రాక్టర్లు
  • భద్రాకొత్తగూడెం జిల్లాలో ఇటీవల పెరుగుతున్న ఘటనలు
  • రెండేండ్లలో 20కిపైగా ప్రమాదాలు.. 10 మంది మృతి 

భద్రాచలం,వెలుగు : మొన్న భద్రాచలం టౌన్​లో అంబేద్కర్ సెంటర్.. నిన్న పాల్వంచ మండలం జగన్నాథపురం హైవే.. ఇలా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట జామాయిల్​ ట్రాక్టర్లు బోల్తా పడుతూనే ఉన్నాయి. బూర్గంపాడు మండలం సారపాకలో ఉన్న ఐటీసీ పేపరు మిల్లుకు జామాయిల్​ తెస్తున్న వాహనాలు పరిమితిని మించి లోడ్​ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐటీసీ పేపర్‍ బోర్డుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్క ఆంధ్రప్రదేశ్​ నుంచి కూడా నిత్యం వందల సంఖ్యలో జామాయిల్, సుబాబుల్​ ట్రాక్టర్లు వస్తుంటాయి. 

గాల్లో తేలుతున్న ట్రాక్టర్లు​.. 

ఒక ట్రాక్టర్‍కు 5 టన్నుల జామాయిల్, సుబాబుల్​ కర్రలు మాత్రమే లోడ్‍ చేయాలి. కానీ 12 నుంచి14 టన్నుల వరకు లోడ్ చేస్తున్నారు. ఐటీసీకి కర్రను తోలే కాంట్రాక్టర్లు మోటారు వెహికల్‍, పోలీస్‍శాఖలను మేనేజ్ చే సుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక లోడ్‍తో వస్తున్న ట్రాక్టర్లు రోడ్డుపై చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ట్రాక్టర్​ ముందు భాగంలోని టైర్లు గాలిలో తేలుతుంటాయి.

డ్రైవర్‍ ఆపి, తిరిగి స్టార్ట్ చేసినప్పుడు వెనుక ఉన్న ట్రక్కు లోడును లాగలేక ముందు చక్రాలు ఇంజిన్‍తో సహా పైకి లేచి పడిపోతున్నాయి. ఇలా పడిపోయిన ట్రాక్టర్లు ట్రాఫిక్‍కు అంతరాయం కలిగిస్తున్నాయి. ప్రమాదాల్లో డ్రైవర్లు కూడా చనిపోతున్నారు. కనీసం లైసెన్స్ కూడా లేని డ్రైవర్లు, మైనర్లు ట్రాక్టర్లను నడుపుతున్నారు. దీనికి తోడు మద్యం సేవించి రాత్రి వేళల్లో ఓవర్​స్పీడ్‍, ఓవర్​ లోడ్‍తో డ్రైవర్లు విజయవాడ–జగదల్‍పూర్‍ రహదారిపై విన్యాసాలు చేస్తున్నారు. 

నింబధనలకు విరుద్ధంగా వెహికల్స్​ డిజైన్​

సుబాబుల్​ ట్రాక్టర్ల విషయంలో నిబంధనలను ఆఫీసర్లు గాలికి వదిలేశారు. ట్రక్కు మోటారు వాహన చట్టానికి అనుగుణంగా తయారు చేయాలి. కానీ కాంట్రాక్టర్లు అధిక లోడ్‍ను మోసేలా వాటిని తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద ట్రక్కులు, రెండేసి టైర్లు పెట్టుకున్నారు. కానీ సర్కారుకు కట్టేది మామూలు రుసుమే. ఇక లోడ్​ ట్రాక్టర్​ వెనుక భాగంలో రేడియం స్టిక్కర్‍తో డేంజర్​ బోర్డును పెట్టుకోవాలి.

ఇవేమీ ఉండడం లేదు. ఇవి లేకపోవడంతో  గతంలో గోదావరి వంతెనపై ఇద్దరు యువకులు మోటారు సైకిల్‍పై వెనుక నుంచి ట్రక్కును ఢీ కొట్టి అక్కడికక్కడే చనిపోయారు. ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు 20కి పైగా జరిగాయి. ఇటీవల క్రమంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రెండేండ్లలో 10 మందికి పైగా చనిపోయారు. అయినా ఆఫీసర్లు లోడ్ ట్రాక్టర్ల నిబంధనల విషయంలో చర్యలు తీసుకోవడం లేదు.  ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

ఓవర్​లోడ్​ వెహికల్స్ కు ఫైన్

ఓవర్​ ​లోడ్​తో వచ్చే జామాయిల్​ ట్రాక్టర్లను పట్టుకుని, ఫైన్​ వేస్తున్నాం. డ్రైవర్లకు కౌన్సిలింగ్​ కూడా ఇస్తున్నాం. రవాణశాఖ కూడా దాడులు చేస్తోంది. వాహనాలను సీజ్​ చేస్తోంది. నిబంధనల ప్రకారమే లోడ్​ చేయాలి. అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం.

శ్రీనివాసరావు, ట్రాఫిక్​ ఎస్సై, భద్రాచలం

భయం భయంగా వెళ్తున్నాం.. 

రోడ్డుపై జామాయిల్​లోడ్​ ట్రాక్టర్లు కనిపించాయంటే భయం, భయంగా ముందుకు వెళ్తున్నాం. ఏ ట్రాక్టరు ఏ మూల నుంచి వచ్చి ఢీకొడుతుందో? అన్నట్లుగా ఉంటుంది. ఎక్కువ లోడ్​తో వెళ్లే ట్రాక్టర్ల వల్లే  ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ట్రాక్టర్లను అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలి. 

 మునిగేల శివ ప్రశాంత్​, భద్రాచలం