
హనుమకొండ, వెలుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరితో పాటు ఓ మైనర్‌ను గురువారం ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ.బారీ తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రంలోని సరస్చప్రా జిల్లాకు చెందిన యోగేంద్రరామ్, వేదవతీదేవి సహజీవనం చేస్తూ కూలీ పనులు చేసుకునేవారు.
వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఖట్సే ఏరియాకు చెందిన గంజాయి వ్యాపారి అఖిలేష్ పరిచయం పెంచుకున్నారు. తర్వాత ఓ మైనర్‌తో కలిసి గంజాయి వ్యాపారం ప్రారంభించారు. ఇందులో భాగంగా బీహార్ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌కు చెందిన అరవింద్ అనే వ్యక్తికి అమ్మేవారు. ఈ క్రమంలో 24 కేజీల గంజాయిని రైలులో తీసుకొస్తుండగా సమాచారం తెలుసుకున్న వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4.7 లక్షల విలువైన గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు.