మహిళలపై పెరుగుతున్న నేరాలు..అంతం లేదా...

నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌‌ బ్యూరో (ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ)  గత వారం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఏటికేడు మహిళలపై నేరాలు పెరుగుతున్నట్లు తేలింది. వారి గణాంకాలను ప్రకారం దేశవ్యాప్తంగా స్త్రీలపై నేరాల సంఖ్య 2020 సంవత్సరంతో పోల్చితే 15.3% పెరిగి 2021 సంవత్సరంలో  428,278 కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి 2021లో స్త్రీలపై జరిగిన నేరాల సంఖ్య పెరిగిందే కానీ తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రతకు భరోసా లేకుండా పోయిందనే విషయాన్ని ఈ నివేదిక సుస్పష్టం చేసింది. ఎవరికివారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమకన్నా ఎక్కువ నేరాలు నమోదైన రాష్ట్రంతో పోల్చుకుని మహిళలకు తాము మాత్రమే  భరోసా ఇస్తున్నా౦ అంటూ గప్పాలు కొట్టుకోవడమే కానీ పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పూ లేదు.  ప్రతి ఏటా ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ నివేదికలను విడుదల చేస్తూ, నేరాల సంఖ్య పెరగడానికి గల కారణాలను కూడా చెబుతుంది. మహిళలకు సంబంధించే కాక హత్యలు, ఆత్మహత్యలు, కిడ్నాప్‌‌లు,  అత్యాచారాలు, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ హక్కుల రక్షణ, బాలలపై నేరాలు వంటి అంశాలకు సంబంధించి కూడా గణాంకాలను సేకరించి, క్రోడీకరించి ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ నివేదికలు రూపొందిస్తుంది. మన దేశానికి సంబంధించి నమోదు అయిన అన్ని తరహా నేరాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికలు విడుదల చేస్తుంది. 

రాజధానే కానీ రక్షణ లేదు.. 

దేశానికి రాజధాని అయిన ఢిల్లీ మహిళలకు భద్రత లేని మెట్రోపాలిటన్ నగరమని ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ తన తాజా నివేదికలో  వెల్లడించింది. 2021 గణాంకాల ప్రకారం ఢిల్లీలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 13,892 కాగా 2020తో పోల్చితే ఇది 40% అధికం. మెట్రో నగరాల కేటగిరీలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క ఢిల్లీలోనే 33.2% నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత ముంబై, బెంగళూరు ఉన్నాయి. అంటే నాగరికత మరీ ఎక్కువై ఈ నేరాలు జరుగుతున్నాయా అనే సందేహం వస్తుంది.  ఎవరు, ఏంటి, ఎక్కడ అనే నిఘా లేకపోవడం, అధిక జనాభా, వలసలు ఇవన్నీ కూడా ఈ నేరాలకు కారణంగా ఉన్నాయి. రాజధానికి చేరువలో ఉండే రాజస్థాన్,  ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కూడా స్త్రీలపై జరిగే నేరాల సంఖ్య అధికంగానే ఉంది. 

అంతం లేదా...  

మాట వినలేదని, ప్రేమించలేదని, కులాంతర వివాహం చేసుకుందని.. ఏదో ఒక కారణంతో స్త్రీలపై దౌర్జన్యం చేయడం అలవాటుగా మారింది.  ముఖ్యంగా స్త్రీలు అక్షరాస్యులు కావాలి. ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వ వికాసానికి చదువే మూలం అని వారు తెలుసుకోవాలి. దేశంలో అత్యంత నిరాదరణకు గురైంది, వార్షిక బడ్జెట్లో తక్కువ కేటాయింపులు చేసేది విద్యారంగానికే.  వాస్తవానికి మనదేశంలో జీడీపీ 6% వరకు విద్యకు కేటాయించాలని దశాబ్దాల క్రితమే మేధావులు సిఫార్సు చేశారు. కానీ ఇప్పటికీ 4% కూడా  దాటలేదు.  2019-–20లో 2.8%, 2020-–21లో 3.1, 2021-–22లో 3.1% కేటాయింపులు జరిగాయని స్వయంగా దేశ ఆర్థిక మంత్రి వెల్లడించారు. తిరిగి అందులో మహిళలు, బాలికల విద్యకు ఎంత కేటాయిస్తున్నారంటే జవాబు లేని ప్రశ్నే అవుతుంది. ఆర్థికాభివృద్ధిలో దేశం ముందంజ అంటారు కానీ మానవాభివృద్ధి సూచికలో మహిళలు కనబడరు. ఆడవాళ్ళందరికీ నిర్భంద ఉన్నత విద్య అనే షరతు  పెట్టాలి. వారికి అవకాశాలు ఇచ్చి సమాజంలో ఉన్నతంగా నిలిపినప్పుడే ఈ నేరాల సంఖ్య తగ్గుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు వారి సన్నిహితులు భాగస్వాముల నుంచి లైంగిక హింసకు గురవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి.  ఈ పరిస్థితులు మారాలి అంటే రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి. మీడియా కూడా నేరాలు తగ్గించడంలో పాత్ర వహించాలి. నా దాకా వస్తేనే అనే వ్యక్తిగత ఆలోచన మారనంత వరకు స్త్రీలపై జరిగే నేరాల సంఖ్య తగ్గదు. లేదంటే ప్రతి ఏడూ ఇలాంటి నివేదికలు వస్తుంటాయి.  చర్చిస్తారు.  మర్చిపోతారు. మళ్లీ కథ మొదటికే వస్తుంది. 

రెండు తెలుగు రాష్ట్రాల పరిశీలన 

ముఖ్యంగా తెలంగాణలో  స్త్రీలపై నేరాలు మరింతగా పెరిగాయి. 2020 నివేదిక ప్రకారం 17,791 నేరాలు జరగగా, 2021లో 20,865 కు పెరిగాయని నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా ఇందులో 9,468 నేరాలకు వారి భర్తలు లేదా బంధువులే కారణమని, అత్యాచార సంఘటనలో  95.5% తెలిసిన వారేననే  దిగ్భ్రాంతిని కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో  జరిగే మొత్తం నేరాల్లో అధిక సంఖ్య నేరాలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదు అవుతున్నాయి. అంటే ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, చదువుకున్న వారు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉండే మహానగరంలో స్త్రీలకు భద్రత లేదన్నమాట. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే స్త్రీలపై జరిగే నేరాల్లో 10వ స్థానంలో ఉంది. 2020 తో పోల్చితే 2021లో 3.8% నేరాలు పెరిగాయి. అయితే నేరాలు  నమోదు అయ్యి,  ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులు 2020లో 90% ఉంటే 2021లో 93.5శాతానికి పెరిగాయి. గుడ్డిలో మెల్ల నయం అన్నట్టు కనీసం ఛార్జ్ షీట్ ఫైల్ అయితే తదుపరి దర్యాప్తు, శిక్ష పడడం లాంటి చర్యలు త్వరితగతిన పూర్తవుతాయని  పరిశీలకులు అంటున్నారు.  దిశ కింద నమోదైన కేసులన్నీ ఏడు రోజుల్లోపు దర్యాప్తు ముగించి, ఛార్జ్ షీట్  ఫైల్ చేయాలని నిబంధన ఉన్న కారణంగా ఇది సాధ్యమైంది.  దిశ చట్టం అమల్లోకి రాకపోయినా దిశా యాప్ వాడకం పెరిగింది. దీనివల్ల కూడా నేరాలు తగ్గాయంటున్నారు.

- పండలనేని గాయత్రి, ఇండిపెండెంట్‌‌ జర్నలిస్ట్‌‌