తెలంగాణలో గతేడాది ఫిబ్రవరిలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతని అక్రమ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. వెయ్యి కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ లెక్కలతో తెలిపింది.
గత ఆగస్టులో పట్టుబడిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ నరేందర్ అక్రమ ఆస్తుల చిట్టా విప్పితే.. రూ. 500 కోట్లు ఉన్నట్టు తేలింది. గత డిసెంబర్లో హైదరాబాద్‌లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈఈ నిఖేశ్ కుమార్‌పై ఏసీబీ రైడ్స్ చేయగా.. అతని అక్రమ సంపాదన కూడా రూ. 600 కోట్లకుపైగా ఉంటుందని వెల్లడైంది.
ఇది ఏసీబీ రైడ్స్ చరిత్రలోనే రెండో అతి పెద్ద ఆపరేషన్గానూ పేర్కొంది. బీఆర్ఎస్ హయాంలో ఓ ఎమ్మెల్యేకు బంధువైన జమ్మికుంట మాజీ తహసీల్దార్ రూ. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిందని ఏసీబీ తనిఖీల్లోనూ స్పష్టమైంది. ఇవి రాష్ట్రంలో కొన్ని అవినీతి తిమింగాలు, అనకొండల అక్రమాల చిట్టా మాత్రమే! రాష్ట్రంలో 2024వ సంవత్సరంలో సుమారు 200 మందికి పైగా అవినీతి అధికారులు, ఉద్యోగులు పట్టుబడినట్టు ఏసీబీ లెక్కల ద్వారా తెలుస్తోంది.
రాష్ట్రంలో అవినీతి అధికారులు, ఉద్యోగులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. లంచం పుచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఏసీబీ దూకుడుగా వెళ్తూ.. లంచగొండుల అవినీతి అక్రమ ఆస్తుల చిట్టా బట్టబయలు చేస్తోంది.
ప్రభుత్వాఫీసుల్లో గంజాయి వనంలో తులసి మొక్కల వంటి ఉద్యోగులను వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. నిజాయతీ అధికారిని గుర్తించడం ఎంతో కష్టంగా మారింది. ఒక రకంగా ఆఫీసుల్లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాలకులు ఎవరొచ్చినా అవినీతిపరుల్లో ఎలాంటి వణుకు బెణుకు ఉండడంలేదు. ప్రజాస్వామ్యానికి, పాలనా వ్యవస్థకు అవినీతి ఒక రాచపుండులా తయారైంది.
అవినీతిలో రాష్ట్రం ఐదో ప్లేస్
ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైపోయినామని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో అవినీతి అనేదే లేకుండా చేస్తామని, లంచం అడిగిన అధికారిపై ఫోన్ చేస్తే చాలని.. వాళ్ల భరతం పడతామని తొలి పదేండ్ల పాలక నేత ఢంకా బజాయించి చెప్పారు. అవన్నీ వట్టి మాటలే అని తేలిపోయాయి.
2019లో ఇండియా కరప్షన్ సంస్థ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేయగా.. అందులో తెలంగాణలో అవినీతి దారుణంగా ఉందని తేల్చింది. అత్యంత అవినీతి రాష్ట్రాల జాబితాలో 5వ స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేసింది. ఇలా గత పాలకులు లంచగొండి అధికారులపై ఉపేక్షించిన తీరేంటో ఆ సర్వేనే ఎండగట్టింది.
గతేడాది మే నెలలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) సంస్థ కూడా ప్రస్తుత సర్కార్ కు ఒక లేఖ అందజేసింది. దశాబ్ద కాలంలో అవినీతి అధికారులపై విజిలెన్స్ శాఖ 3,336 రిపోర్టులను ఇచ్చినా.. అప్పటి సర్కార్ పెద్దలు తొక్కిపెట్టారని పేర్కొంది.
పదేండ్లలో కొందరు అధికారులు, ఉద్యోగుల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందనేది కూడా ఆ విజిలెన్స్ రిపోర్టు తేటతెల్లం చేసింది. మరోవైపు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం పేరిట చేసిన రూ. లక్షల కోట్ల అప్పుల్లో జరిగిన అవినీతి తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగానే అయింది. ఆనాటి పాలకులు లంచగొండి అధికారులు, ఉద్యోగులపై చూపిన ఉదాసీనత .. పరోక్ష ప్రోత్సాహంతోనే ప్రజలు కుర్చీ నుంచి దింపేశారని కూడా చెప్పొచ్చు.
ఏసీబీ పనీతీరు బాగుంది
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రజాపాలనలో అవినీతిని సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో ఏకకాలంలో ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ రైడ్స్ సంచలం సృష్టించాయి. ఇది ప్రభుత్వ సాహసోపేత నిర్ణయంగా చెప్పొచ్చు.
ముఖ్యమంత్రి ఏసీబీకి కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో మరింత దూకుడు పెంచి అవినీతి అధికారుల భరతం పడుతోంది. రెవెన్యూ, మున్సిపల్, వాణిజ్య, పోలీసు.. ఇలా ఏ శాఖలో అవినీతి అధికారిపైనా ఫిర్యాదులు, ఫోన్ కాల్ వెళ్లినా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్న ఘటనలు కొద్దినెలలుగా మీడియాలోనూ చూస్తున్నాం. గత పదేండ్ల పాలనతో పోల్చుకుంటే.. ప్రస్తుత పాలనలో లంచగొండి అధికారులను ఉపేక్షించమనే ప్రభుత్వ పెద్దల తీరు కనిపిస్తోంది.
తాజాగా కొద్ది రోజుల కింద వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో రెవెన్యూ, మున్సిపల్, పోలీసు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నట్టు.. ఏసీబీ కేసులు కూడా ఆయా శాఖల్లోనే అధికంగా నమోదైనట్టు సమాచారం.
చట్టాలు కఠినంగా ఉండాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల స్థాయిలోనూ పబ్లిక్ గ్రీవెన్సెస్ పై.. పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండా లి. ప్రతి అప్లికేషన్ కు టోకెన్ ఇచ్చి.. సాల్వ్ చేసే గడువును కూడా విధించేలా చూడడమే కాకుండా.. ఆలస్యానికి కారకులైన అధికారులకూ ఫైన్లు విధించే పద్ధతి పాటించాలి.
అలాగే సిటిజన్ చార్టర్ బోర్డు ఉండగా.. దానికి చట్టబద్ధత కల్పించాలి. ఏసీబీ చట్టాలను మరింత కఠినంగా రూపొందిం చి అమలు పరచాలి. అవినీతి అధికారులకు శిక్షలు కూడా త్వరగా పడేలా చట్టాల్లోనూ మార్పు లు తేవాలి.
ఉదాహరణకు ఆర్మీలో ఎవరైనా ఉద్యోగి తప్పు చేస్తే.. అది నిరూపణ అయితే శాశ్వతంగా విధుల నుంచి తొలగించే శిక్షలు ఉంటాయి. అలాంటి కొన్ని కఠినమైన రూల్స్ అవినీతి అధికారు లపైనా ప్రభుత్వం ప్రయోగించేందుకు చట్టాలను రూపొందించాలి. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే చాలావరకు అవినీతిని అరికట్టవచ్చు.
- వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్