యాదాద్రి తరహాలో కొండగట్టు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు రావడం జరిగిందని, ప్రెస్టీజియస్ ప్రాజెక్టు యాదాద్రి తర్వాత కొండగట్టును ఎంచుకోవడం శుభసూచకమని ఆనంద్ సాయి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ అవసరమున్న పనులను గుర్తించి నివేదించాలని సూచించారు. భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేలా అర్చకులతో కలిసి మాస్టర్ ప్లాన్ పైన చర్చించామన్నారు. 3,4 రోజుల్లో సీఎం కేసీఆర్ కొండగట్టుకు రానున్నారన్న ఆనంద్ సాయి.. 108 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. అన్ని వైపుల నుండి అంజన్న విగ్రహం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. మొదటి, రెండవ ప్రాకారాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం జరిగేలా చూస్తామన్న ఆనంద్ సాయి.. వాటర్, ఎలక్ట్రికల్ సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు కు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి బడ్జెట్ లో రూ.100 కోట్లు ప్రవేశపెట్టడంతో ఆలయ మాస్టర్ ప్లాన్ పైనా సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన యాదాద్రి రూపకర్త ప్రముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి మొదటగా అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.