కేంద్ర మంత్రి నిర్మలపై కేసు నమోదు 

 కేంద్ర మంత్రి నిర్మలపై కేసు నమోదు 
  • బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎఫ్ఐఆర్​
  • కార్పొరేట్లతో ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారనే  పిటిషన్​పై ఉత్తర్వులు

బెంగళూరు: బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​పై కేసు నమోదు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా బీజేపీకి నిధులు దోచిపెట్టారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్​ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. నిర్మలతో పాటు ఈ కేసులో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కర్నాటక బీజేపీ నేతలు నలీన్ కుమార్ కటీల్, బీవై విజయేంద్ర, పలువురు ఈడీ ఆఫీసర్ల పేర్లు కూడా ఉన్నాయి.

శనివారం వీరిపై పలు సెక్షన్ల  కింద పోలీసులు ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు. ఎన్​ఫోర్స్​మెంట్​డైరెక్టరేట్ (ఈడీ) దాడుల పేరుతో కార్పొరేట్లను, పారిశ్రామిక వేత్తలను భయపెట్టి బీజేపీ ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారని జనాధికార సంఘర్ష సంఘటనే (జేఎస్‌‌పీ)కు చెందిన ఆదర్శ్ అయ్యర్ గతంలో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆయన ఫిర్యాదును తిరస్కరించారు.

దీంతో ఆయన స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు ఎన్నికల వేళ ఈడీ దాడుల ఒత్తిడి వ్యూహంతో కార్పొరేట్ సంస్థలతో రూ.వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారని ఆరోపించారు. ఆ బాండ్ల డబ్బుతో బీజేపీ నేతలు ఎన్నికల్లో ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమమార్గంలో నిధులు కూడగట్టుకునేలా చేసిందని.. దీని వెనక నిర్మల, ఇతర బీజేపీ నేతలు ఉన్నారని అందులో తెలిపారు. పిటిషన్​ విచారించిన విచారించిన కోర్టు నిర్మల, నడ్డా తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది.