తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో దేశంలోని ప్రధాన దేవాలయాలు ప్రసాదాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. మధ్యప్రదేశ్లోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ ప్రసాదం నాణ్యతను పరీక్షించాలని భక్తుల నుంచి డిమాండ్ రావడంతో ప్రసాదాన్ని టెస్ట్కు పంపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మహాకాళేశ్వర్ ఆలయ ప్రసాదం నాణ్యతను పరీక్షించి ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ను విడుదల చేసింది.
మహాకాళేశ్వర్ ఆలయ ప్రసాదంలో భాగంగా ఇస్తున్న లడ్డూ ప్రసాదం పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు పాటించి తయారుచేసిందేనని స్పష్టం చేసింది. ఈ పరీక్ష ప్రైవేట్, గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ రెంటిల్లో జరిగింది. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి, పంచదార, డ్రై ఫ్రూట్స్.. ఇలా ప్రతీ ఒక్క ఇన్గ్రేడియంట్ను టెస్ట్ చేసి స్వచ్ఛమైనవేనని FSSAI నిర్ధారించింది. టెస్ట్ రిపోర్ట్స్లో ఉజ్జయిని మహాకాళ్ ఆలయ లడ్డూ ప్రసాదానికి 5 స్టార్ హైజీన్ రేట్ దక్కింది.
ALSO READ | హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. జగన్ సంచలన ట్వీట్
ప్రతిరోజు సుమారు 50 క్వింటాలకు పైగా లడ్డూ ప్రసాదాన్ని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తయారుచేస్తున్నారు. రోజుకు పది గంటల పాటు 50 మందికి పైగా వర్కర్స్ లడ్డూ తయారీలో నిమగ్నమై పనిచేస్తున్నారు. మహాకాళేశ్వర్ ప్రసాదం టెస్ట్కు పంపించడంపై ఫుడ్ సేఫ్టీ అధికారి బసంత్ దత్ శర్మ మాట్లాడుతూ.. రొటీన్ తనిఖీల్లో భాగంగా లడ్డూ ప్రసాదం నాణ్యతను పరీక్షించినట్లు తెలిపారు.