దేశంలో తగ్గుతున్న పేదరికం

గ్లో బల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేదా బహుమితీయ పేదరిక సూచిక తాజా 2023 నివేదికను యునైటెడ్ నేషన్స్ డెవలప్‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్​డీపీ), ఆక్స్‌‌‌‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఆక్స్‌‌‌‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌‌‌‌మెంట్ ఇనీషియేటివ్ విడుదల చేసింది. ఇందులో భారత్‌‌‌‌ సహా 25 దేశాలు తమ గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విలువలను 2005-–06 నుంచి 2019–-21 వరకు 15 ఏండ్లలో విజయవంతంగా సగానికి తగ్గించుకున్నాయని, వేగవంతమైన పురోగతిని సాధించగలమని చూపుతున్నట్లు పేర్కొంది. ఈ దేశాల్లో కంబోడియా, చైనా, కాంగో, హోండురాస్, ఇండియా, ఇండోనేసియా, మొరాకో, సెర్బియా, వియత్నాం ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సమాచారం ప్రకారం.. ఏప్రిల్‌‌‌‌లో భారతదేశం142.86 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించింది. ముఖ్యంగా భారతదేశం పేదరికంలో గణనీయమైన తగ్గింపును చూసి, కేవలం15 ఏండ్ల వ్యవధిలో 415 మిలియన్ల మంది పేదరికం నుంచి నిష్క్రమించారని నివేదిక పేర్కొంది.

అలాగే పేదరికాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని, అయితే కోవిడ్-19 మహమ్మారి కాలంలో సమగ్ర సమాచారం లేకపోవడం తక్షణ అవకాశాలను అంచనా వేయడంలో సవాళ్లను కలిగిస్తుందని కూడా పేర్కొంది. తొమ్మిదేండ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో పేదరికం తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమే. ప్రపంచ బహుమితీయ పేదరిక సూచిక నివేదికలో ప్రచురితమైన కొలమానంలో ఉండే ప్రధాన అంశాలు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం ఉంటాయి, ఆరోగ్య అంశాల్లో పోషకాహారం, పిల్లల మరణాలు కొలమానాలుగా, విద్యలో పిల్లల బడి, బడి హాజరు ఉండగా, జీవన ప్రమాణాల్లో వంట ఇంధనం లభ్యత, పారిశుధ్యం, తాగు నీరు, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, మౌలిక వనరులు లాంటి కొలమానాలని ప్రాతిపదికగా పేదరికాన్ని కొలుస్తారు. 

మల్టీ డైమెన్షనల్​ పావర్టీ..

ఇండియాలో 2005-–06లో 55.1 శాతం పేదరికం ఉండగా 2019–-21 నాటికి16.4 శాతానికి పడిపోయిందని యూఎన్ రిపోర్టు వెల్లడించింది. ఇది కొంత వరకు దేశానికి ఒక మంచి పరిణామం. 2005–-06లో మన దేశంలో 64.5 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. 2015–-16 నాటికి పేదరికంలో ఉన్న వారి సంఖ్య 37 కోట్లకు ఆ తర్వాత 23 కోట్లకు ఈ సంఖ్య తగ్గింది. అలానే దేశంలో 2005–-06లో 44.3 శాతంగా ఉన్న పేదలు న్యూట్రిషన్ ఇండికేటర్‌‌‌‌లో 2019–-21 నాటికి 11.8 శాతానికి తగ్గారు. పిల్లల మరణాలు 4.5 % నుంచి 1.5 శాతానికి తగ్గాయని, 110 దేశాల్లోని 610 కోట్ల మందిలో 110 కోట్ల మందికిపైగా తీవ్ర పేదరికం లో ఉన్నట్లు యూఎన్ నివేదిక తెలిపింది. సబ్ సహారా ఆఫ్రికాలో 53.4 కోట్ల మంది, సౌత్ ఆసియాలో 38.9 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్లుగా, ప్రతి ఆరుగురిలో ఐదుగురు దుర్భర పరిస్థితిలోనే ఉన్నట్లు పేర్కొంది. 

ప్రభుత్వ పథకాల ప్రభావం..

పేద కుటుంబాలను నేరుగా ప్రభావితం చేసే పథకాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే పలు పథకాలను ప్రవేశపెట్టి, ఇది వరకే ఉన్న మంచి స్కీంలను సరిగా అమలు పరిచేందుకు కృషి చేసింది. నేడు కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడంలో దోహదపడ్డాయనే చెప్పాలి. ఫలితంగా నేడు దేశంలో పేదరికం తగ్గుతున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పేద కుటుంబాలకు ఎల్​పీజీ గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేస్తోంది. 31 మే, 2023 నాటికి మొత్తం 95,859,418 కనెక్షన్లు ఇవ్వగా,  ఉజ్వల 2.0 ద్వారా 15,994,338 కనెక్షన్లు ఇచ్చింది. దీని వల్ల కట్టెల పొయ్యి మీద వంట బాధ తప్పి ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి. స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ ద్వారా దేశంలో ఇంటింటికీ మరుగుదొడ్డి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేదరికాన్ని పరిష్కరించడానికి దోహదపడింది. ఈ పథకం ప్రజల జీవన ప్రమాణాల ‘గృహ నాణ్యత’ అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది. లక్షలాది మంది పేద ప్రజలు ఇది వరకు వారు గడ్డి కప్పులతో, కచ్చా మట్టి ఇళ్లలో నివసించేవారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పట్టణ ప్రాంతాల్లో 118.9 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. 75.31 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ 2,31,46,327 ఇండ్ల నిర్మాణం పూర్తయి.. పేదల సొంతింటి కల నెరవేరింది.

ఉపాధి హామీతో మేలు

వంద రోజుల ఉపాధిని ఇచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదరికం తగ్గుముఖం పట్టడానికి ప్రధానకారణమని గ్రామీణాభివృద్ధి రంగనిపుణులు విశ్లేషించారు. 2006లో ప్రారంభమైన ఈ పథకం పూర్తిస్థాయిల్లో అమల్లోకి వచ్చిన నాటి నుంచే పేదరికం తగ్గుముఖం పడుతూ వచ్చిందని పేర్కొంటున్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 31 మే, 2023 వరకు 23.39 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 61,501 కోట్ల ఉచిత చికిత్స అందింది. నాణ్యమైన వైద్యం అందడం కూడా పేదరికం తగ్గేందుకు సాయపడింది. గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు 2024 నాటికి వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షిత తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం గ్రామీణ కుటుంబాలు 19,46,29,202 ఉండగా, 12,53,49,027 (64.40%) గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు వచ్చి, స్వచ్ఛ మైన తాగునీరు అందుతున్నది.

ఇలా ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల మెరుగుదల లాంటి అంశాలను ప్రభావితం చేసే నేటి కేంద్ర ప్రభుత్వ పలు పథకాలు దేశ పేదరికాన్ని తగ్గించడంలో దోహద పడ్డాయి. ఈ పథకాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రతి పల్లెకు, మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకోవాలి. ప్రపంచంలో భారత్ బలమైల ఆర్థిక శక్తిగా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగినప్పుడే పేదరికాన్ని తగ్గించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

- డా. శ్రవణ్ కుమార్ కందగట్ల,