హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ వాతావరణ శాఖ రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉత్తర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. రాత్రి టైంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు అన్నారు. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.
హైదరాబాద్ లో ఉదయం నుంచి ముసురు...
హైదరాబాద్ లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. తెల్లవారు జాము నుంచి ముసురు వాన పడుతోంది. దీంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మలక్ పేట్, ఎల్బీనగర్, కోఠి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సిటీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలెర్ట్ అయింది. గ్రేటర్ పరిధిలోని అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. రోడ్లపై నీళ్లు ఆగిన చోట వెంటనే క్లియర్ చేయటంతోపాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలా పరిసరాలకు జనం వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి...
జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో చెరువులకు గండి పడుతోంది. రాష్ట్రంలో గత నెల 7 నుంచి భారీ వర్షపాతం నమోదువుతోంది. 40 ఏళ్లలో ఈ స్థాయిలో వానలు ఎప్పుడూ కురవలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నదులు ఉప్పొంగుతున్నాయి. మరో 3 రోజులపాటు వర్షాలు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన వర్షపాతం...
కొమ్రంభీం జిల్లా వాంకిడిలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్పూర్ లో 6.5 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ లోని ఉట్నూర్ లో 5.5 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 5.3 సెంటీమీటర్ల వర్షం పడింది. మంచిర్యాలలో 5.2, ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో రాజేంద్రనగర్ లో 10 మిల్లీమీటర్ల వర్షం పడింది. కుత్బుల్లాపూర్ లో 9 మిల్లీమీటర్లు, కాప్రాలో 8.5 మిల్లీమీటర్లు, అల్వాల్ లో 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.