సాగు భూమి లేని హైదరాబాద్​లో అత్యధిక క్రాప్​లోన్లు : కన్నెగంటి రవి,

రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం లాంటి ప్రాధాన్యతా రంగాలకు 40 శాతం లోన్లు ఇవ్వాలి. అందులో18 శాతం పంట రుణాలుగా ఇవ్వాలి. బ్యాంకుల నుంచి రైతులకు ఈ పెట్టుబడి అందితే బయట అధిక వడ్డీలకు పెట్టుబడి తెచ్చుకోవాల్సిన బాధ తప్పుతుంది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌వో తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 91 శాతం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం అవసరమైన సంస్థాగత రుణాలు అందకపోవడమే. రైతు బంధు సాయం అందిస్తున్నామనే పేరుతో, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి కీలకంగా ఉపయోగపడే పెట్టుబడి సమీకరణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. పంట పండిస్తున్న రైతులు డీఫాల్టర్లుగా మారుతుంటే.. పట్టణాల్లో ఉండే భూయజమానులు పంట రుణాలు పొందుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2014లో, 2018లో రుణ మాఫీ హామీలు ఇచ్చి సరిగా అమలు చేయక పోవడం వల్ల రాష్ట్రంలో మొత్తం సంస్థాగత రుణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం పూర్తిగా తగ్గింది. రాష్ట్రంలో కనీసం 2014 నాటికి 50 లక్షల మంది రైతులు ఉన్నారని అనుకుంటే, వారిలో 2015 ఖరీఫ్ సీజన్ లో  కేవలం 24,12,790 మందికి, 2016 ఖరీఫ్ లో 26,27,797 మందికి, 2017 ఖరీఫ్ లో18,46,000 మందికి, 2018 ఖరీఫ్ లో 79,731 మందికి , 2019 ఖరీఫ్ లో 18,60,155 మందికి, 2020 ఖరీఫ్ లో 17,35,999  మందికి, 2021 ఖరీఫ్ లో 15,46,804 మందికి మాత్రమే పంట రుణాలు బ్యాంకుల నుంచి అందాయి. రాష్ట్రంలో ఒక కోటీ 45 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుంటే, బ్యాంకులు 2021–-2022 లో పంట రుణాలకు  లక్ష్యంగా కేవలం 55,74,152 ఎకరాలనే పెట్టుకున్నాయి. ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ త్రైమాసిక నివేదిక 2022 సెప్టెంబర్ ప్రకారం పంట రుణాల లక్ష్యం రూ. 67,864.39 కోట్లు కాగా, ఖరీఫ్ లో పంపిణీ చేసినట్లుగా చెప్పుకున్నది రూ. 23,793.15 కోట్లు(లక్ష్యంలో 35.06 శాతం) మాత్రమే. 2014 నుంచి 2022 వరకు ఈ తొమ్మిదేండ్ల గణాంకాలను బట్టి రాష్ట్రంలో సంస్థాగత రుణ వ్యవస్థ ఎంతగా కుచించుకుపోయిందో స్పష్టమవుతున్నది. బ్యాంకులు చెబుతున్న ఈ రుణాల ద్వారా పెట్టుబడి కోసం నగదు రైతుల చేతుల్లోకి వచ్చిందని అర్థం కాదు. చాలా వరకూ బ్యాంకులు రైతుల నుంచి వడ్డీలను కట్టించుకుని, రెన్యువల్ చేయడమో, లేదా బుక్ అడ్జస్ట్ చేయడమో చేశాయి. రైతులు తమ పంట పెట్టుబడి కోసం మళ్లీ ప్రైవేట్ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. దీనికి కారణం పంట రుణాల మాఫీ హామీని సర్కారు సరిగా అమలు చేయకపోవడమే.

రుణ అర్హత కోల్పోయిన రైతులు 

రుణమాఫీ హామీ అమలు కోసం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్11 వరకు ఉన్న రుణాలను అర్హమైనవిగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ నివేదిక ప్రకారం సుమారు 47,40, 000 మంది రైతులు రుణ మాఫీకి అర్హులు. మాఫీ చేయాల్సిన మొత్తం రూ. 24,738 కోట్లు ఉంటుందని భావించినా, కుటుంబంలో ఇద్దరి పేరున రుణాలు ఉన్న అంశాన్ని గుర్తించి అందులో మరో రూ. 3,881 కోట్లు తగ్గించింది. చివరికి రూ. 20,657 కోట్లుగా అంచనాకు వచ్చింది. కానీ ఆ మొత్తాన్ని మాఫీ చేయలేదు. ఇప్పటి వరకు కేవలం రూ. 37 వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. 2023–-2024 బడ్జెట్ లో కూడా పూర్తి స్థాయి రుణ మాఫీ చేయడానికి అవసరమైన నిధులు కేటాయించలేదు. ఈ ప్రభుత్వానికి ఈ విడతలో చివరి బడ్జెట్ అనేది దృష్టిలో ఉంచుకుంటే, రైతులపై రుణ భారం కొనసాగనున్నట్లు అర్థమవుతున్నది. అలాగే లక్ష లోపు పంట రుణాలకు ఉండే7 శాతం వడ్డీ రేట్లలో కేంద్రం 3 శాతం, రాష్ట్రం 4 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ప్రకటించాయి. కానీ రాష్ట్ర  ప్రభుత్వం మొదటి రుణమాఫీ సమయంలోనే 2015–-2016, 2016–17 సంవత్సరాలకు గాను రూ. 415 కోట్లు చెల్లించాల్సి ఉండగా బ్యాంకులకు చెల్లించలేదు. ఈ దఫా ప్రకటించిన రుణ మాఫీ సమయంలోనూ, గత నాలుగేండ్లుగా బ్యాంకులకు వడ్డీ రాయితీ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. 2015–17 వరకు రెండేండ్లు కేంద్రం తన వాటా 3 శాతం చొప్పున వడ్డీ మొత్తాలను జమ చేసినా, ఆ తరువాత కేంద్రం కూడా వడ్డీ రాయితీ మొత్తాలను జమ చేయడం మానేసింది. ఇప్పుడు బ్యాంకులు రైతుల దగ్గర ముక్కు పిండి వడ్డీలను వసూలు చేస్తున్నాయి. 2021 నుంచి క్రమంగా కాల పరిమితి దాటిన పంట రుణ ఖాతాల సంఖ్య పెరుగుతున్నది. అంటే ఈ ఖాతాలకు వడ్డీ రాయితీ వర్తించదు. బ్యాంకులు విధించే వడ్డీలను రైతులు భరించాల్సి వస్తుంది. ప్రభుత్వం రుణ మాఫీ హామీ అమలు చేయక, రైతులు స్వయంగా చెల్లించలేక రుణ ఖాతాలన్నీ ఎన్‌‌‌‌పీ‌‌‌‌ఏ పరిధిలోకి వెళ్లాయి. అంటే ఈ ఖాతాల రైతులకు బ్యాంకులు ఇక పంట రుణాలు ఇచ్చే అవకాశం లేదు. 2016 నాటికి 74,888 మంది సన్నకారు రైతులు, 91,114 మంది చిన్నకారు రైతులు ఈ ఎన్‌‌‌‌పీ‌‌‌‌ఏ పరిధిలో ఉండగా , 2022 మార్చి నాటికి వీరి సంఖ్య వరుసగా1,63,987 మందికి, 2,06,428 మందికి చేరింది. అంటే ప్రభుత్వం రుణ మాఫీ హామీ అమలు చేయక రైతులు బాధితులుగా మారారు. అసలు రైతులకు అందే సంస్థాగత రుణాలే తక్కువ. ఇప్పుడు వారికి ఎన్‌‌‌‌పీ‌‌‌‌ఏ కారణంగా అవి కూడా అందే అవకాశం లేదు. 

భూ యజమానులకు లోన్లు

వ్యవసాయ శాఖ వీక్లీ రిపోర్ట్స్ ప్రకారం 2022 ఖరీఫ్ లో సెప్టెంబర్ 28 నాటికి 5 లక్షల ఎకరాలకు పైగా సాగైన10 జిల్లాలకు గాను, కేవలం 5 జిల్లాల్లో మాత్రమే 33 శాతం కంటే ఎక్కువ రుణాల పంపిణీ జరిగింది. మిగిలిన జిల్లాల్లో కేవలం18- నుంచి 30 శాతం మధ్య రుణాల పంపిణీ జరిగినట్లు బ్యాంక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయం బాగా జరిగే జిల్లాల్లో పంట రుణాల పంపిణీ లక్ష్యాలు మూడో వంతుకు కూడా చేరుకోలేదు. కానీ నగరీకరణ జరిగి, వ్యవసాయ భూములు గణనీయంగా తగ్గిపోతున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం పంట రుణాల పంపిణీ జోరుగా సాగుతున్నది. మరీ ముఖ్యంగా ఒక్క ఎకరం సాగు భూమి లేని హైదరాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో రూ. 531.04 కోట్లు,  కేవలం 21,212 ఎకరాల్లోనే పంటలు సాగయ్యే మేడ్చల్ జిల్లాలో రూ. 801.29 కోట్లు, కేవలం 3,78,927 ఎకరాలు సాగయ్యే రంగారెడ్డి జిల్లాలో రూ.1417.51 కోట్ల పంట రుణాల పంపిణీ జరిగిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంటే వ్యవసాయం చేయకపోయినా, నగరాలకు చేరి కూడా భూమిపై పట్టా హక్కుల ఆధారంగా ఎక్కువ మంది భూ యజమానులు  బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందుతున్నారని స్పష్టమవుతున్నది. వీరి భూముల్లో సాగు చేసే కౌలు రైతులకు మాత్రం బ్యాంకులు ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వడం లేదు. ఈ సీజన్ లో అందిన మొత్తం వ్యవసాయ రుణాలు తీసుకోవడంలో (పంట రుణాలు  రూ.531.04 కోట్లు , కాలిక రుణాలు రూ.1258.11 కోట్లు, వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల రుణాలు రూ. -280.08  కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రుణాలు రూ. -2,451.13 కోట్లు) కూడా హైదరాబాద్ జిల్లా రూ.4,520 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నది. నిజానికి ఈ వ్యవసాయ రుణాలను గ్రామీణ జిల్లాల్లో ఎక్కువ వినియోగించాలి. అప్పుడే ఆయా జిల్లాల రైతులకు పెట్టుబడి అందుతుంది.

‑ కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక