
చేవేళ్ల, వెలుగు: వైన్ షాపుల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఒక యువకుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం రాజేంద్రనగర్ జోన్ డీసీసీ సీహెచ్ శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల12న అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్‌షాప్ వెనక ఉన్న గోడను నిందితుడు తుమ్మలపల్లి నరేందర్ బద్దలు కొడుతున్న సమయంలో పర్మిట్ రూంలో పడుకున్న భిక్షపతి అనే వ్యక్తి గమనించి గట్టిగా అరిచాడు. నిందితుడు నరేందర్ భిక్షపతిపై దాడి చేసి పారతో కొట్టి చంపాడు. అనంతరం మృతుడి మొబైల్ ఫోన్, కొంత నగదును దొంగిలించాడు. తర్వాత వైన్స్ షాపు గోడకు రంధ్రం చేసి షాపులోకి ప్రవేశించి సుమారు రూ.40 వేల నగదు, మద్యం బాటిళ్లను తీసుకుని పారిపోయాడు.
ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా షాబాద్ మండలానికి చెందిన వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని పుడుగుర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి నరేందర్ హత్య, చోరీ చేసినట్లు గుర్తించి సీతారాంపూర్ గ్రామంలో అరెస్టు చేశారు. నరేందర్ బ్యాంకు ఖాతాలో రూ. 29 వేల నగదు జమ చేయడంతో దాన్ని ప్రీజ్ చేయించారు. గత సంవత్సరం బహుదూర్‌పురా, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు దొంగతనాలు చేసిన నేరస్తుడు అన్నారు. ఈ నెల 2న షాబాద్ మండలంలోని నాగరగూడ వైన్స్ షాపులో దొంగతనానికి పాల్పడింది నరేందరే అని తేల్చారు. ఈ హత్య కేసు ఛేదించిన ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ శశాంక్ రెడ్డి, రాజేంద్రనగర్ జోన్, చేవెళ్ల ఏసీపీలు ప్రశాంత్, కిషన్, షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఓటీ ఎస్సై రవికుమార్ బృందాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమణారెడ్డి అభినందించారు.