సాయిలు హత్య కేసులో నిందితుల అరెస్ట్​

ఆర్మూర్, వెలుగు : హత్య కేసులో నిందితులను అరెస్ట్​ చేసినట్లు అడిషనల్​ డీసీపీ గట్టు బస్వారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్మూర్​లో ప్రెస్​మీట్​ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆర్మూర్ టౌన్​లోని కెనాల్​కట్ట ప్రాంతంలో మూడు రోజుల కింద మైలారపు సోమేశ్ అలియాస్​ సాయిలు (60) ను హత్య చేసిన కనపర్తి సత్యనారాయణ, కనపర్తి రాజు, బడే రవిని అరెస్టు చేసినట్లు చెప్పారు. చిత్తు కాగితాలు ఏరుకునే సాయిలుతో డబ్బుల విషయమై గొడవపడిన ముగ్గురు అతడిని హత్య చేసి పారిపోయారు.

ఏసీపీ వెంకటేశ్వర్​ రెడ్డి పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణగౌడ్​ ఆధ్వర్యంలో పోలీసు బృందం దోబీఘాట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, ముగ్గురు అనుమానాస్పదంగా పారిపోతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా సాయిలును హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. హత్య కేసుతోపాటు ప్రధాన నిందితుడు కనపర్తి రాజు పై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో

సస్పెక్ట్​ ​షీట్​ఉందని, అతడిపై ఆర్మూర్ తోపాటు నిజామాబాద్ టౌన్-1 లో మొత్తం 10 దొంగతనం కేసులు, హత్యాయత్నం కేసు ఉందని, గతంలో జైలు శిక్ష అనుభవించాడని వివరించారు. కేసును చేధించిన పోలీసులను డీసీపీ అభినందించి, రివార్డులు అందజేశారు.