మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లి కోర్టు భవనం పైనుంచి దూకి గంజాయి కేసు నిందితుడు సూసైడ్ చేసుకున్నాడు. నాంపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన సలీముద్దీన్ (25)పై జూన్ 14న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు నమోదైంది. అదే నెల 27న అతడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, సలీముద్దీన్ కోర్టు ఆదేశాల మేరకు పేషీకి హాజరయ్యేవాడు.
బుధవారం పేషీ ఉండటంతో సలీముద్దీన్ నాంపల్లి కోర్టుకు వచ్చాడు. గంజాయి కేసుకు సంబంధించి తొందరలోనే రెండో హియరింగ్ ఉందని తెలుసుకున్న సలీముద్దీన్ భయాందోళనకు గురయ్యాడు. మధ్యాహ్నం కోర్టు బిల్డింగ్ మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని పోలీసులు హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ అతడు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.