ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో 2016లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కోండు రాజేశ్(26) కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చింతలమానేపల్లి ఎస్సై వెంకటేశ్, కౌటాల సీఐ సాదిక్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో కోండు రాజేశ్ తన గ్రామానికి చెందిన 17 ఏండ్ల గిరిజన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించగా.. అప్పటి కౌటాల ఎస్సై వెంకటేశ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
నిందితుడిని సోమవారం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా అడిషనల్ స్పెషల్ పీపీ జీవీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎంవీ రమేశ్ నిందితునికి జీవిత ఖైదుతోపాటు, రూ.80 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.