
- యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు జడ్జి తీర్పు
యాదాద్రి, వెలుగు : దంపతులను హత్య చేసిన కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమాన విధిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు జడ్జి జయరాజు సోమవారం తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2023 అక్టోబర్ 5న భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన గుంటి బస్వయ్య తన ఇంటి ముందున్న దొడ్డిలోని గొర్రెలు విడవడానికి వెళ్లాడు. పక్కనే ఉండే రాసాల రాజమల్లు గొర్రెలను తన ఇంటి ముందు నుంచి తీసుకొని పోవద్దని ఎన్నిమార్లు చెప్పినా వినవా అంటూ బస్వయ్యతో గొడవకు దిగాడు.
గొడవ ముదరగా.. రాజమల్లు పక్కనే ఉన్న పారతో బస్వయ్య తలపై కొట్టాడు. అక్కడికి వచ్చి బస్వయ్య భార్య తిరుపతమ్మ తలపైనా కొట్టాడు. భర్త స్పాట్ లో చనిపోగా.. భార్య ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. మృతుడు బస్వయ్య అల్లుడు గంగమోని శ్రీను ఫిర్యాదుతో భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రాజమల్లును అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. వాదోపవాదాల అనంతరం రాజమల్లుకు పదేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.