ప్రయాగ్ రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అఖిల భారతీయ అఖాడా పరిషత్ ప్రెసిడెంట్ మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ (72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నిన్న (సోమవారం) సాయంత్రం ఆయన బాఘంబరీ మఠంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారంటూ పోలీసులకు సమాచారం అందించింది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్నం ఆయన సభలో పాల్గొనేందుకు రావాల్సి ఉన్నా.. బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి సాయంత్రం తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లామని, ఆయన ఉరికి వేలాడుతూ కనిపించారని శిష్యులు తెలిపారు. స్వామీజీ గదిలో సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు తెలిపారు. మానసికంగా డిస్టర్బ్ అయినందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన తర్వాత ఆశ్రమాన్ని ఎవరు నడిపించాలనే విషయాన్నీ అందులో రాశారని తెలిపారు. సూసైడ్ నోట్‌లో ఆనంద్ గిరితో పాటు ఇతర శిష్యుల పేర్లను ప్రస్తావించినట్లు చెప్పారు. ఇన్నాళ్లూ అందరూ గర్వపడేలా తాను అభిమానంతో జీవించానని, ఇకపై అలాంటి గౌరవం లేకుండా జీవించలేనని ఆయన సూసైడ్ నోట్ లో రాసినట్లు పేర్కొన్నారు.
మృతిపై అనుమానాలు..
నరేంద్ర గిరి స్వామీజీ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని, డబ్బు కోసం ఆయనను టార్చర్ పెట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన శిష్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తనకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్రలా ఉందని, దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కొందరు పోలీస్ అధికారులు, ల్యాండ్ మాఫియాకు చెందిన వాళ్లు ఈ కుట్ర వెనక ఉన్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది ఆత్మహత్యా? లేక హత్యనా? అన్న కోణాల్లో ఎంక్వైరీ జరుగుతోందన్నారు.
శిష్యుడు ఆనంద్ గిరిపై అరెస్ట్
స్వామీజీ మృతి కేసులో ఇప్పటికే పలు ఆధారాలను సేకరించామని, దోషులను విడిచిపెట్టేది లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి మహంత్ నరేంద్ర గిరి లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆత్మకు రామ పాదాల దగ్గర స్థానం దొరకాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. స్వామీజీ లేని లోటను తట్టుకునే శక్తిని ఆయన శిష్యులకు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మహంత్ మృతి కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. సోమవారం రాత్రే ఆయన శిష్యుడు ఆనంద్ గిరిని హరిద్వార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. అనుమానం ఉన్న మరో ఇద్దరు శిష్యులు సందీప్ తివారీ, ఆద్యా తీవారీలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మఠంలో ఉన్న పలువురు సాక్ష్యులను పోలీసులు విచారిస్తున్నారు. గతంలో మహంత్ నరేంద్ర గిరి శిష్యుడు ఆనంద్ గిరి మఠంలో కొన్ని అక్రమాలు చేశాడని, అతడిని మఠం నుంచి గెంటేశారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఆనంద్ వచ్చి స్వామీజీ కాళ్లపై పడి క్షమాపణ వేడుకోవడంతో క్షమించి మళ్లీ మఠంలో పెట్టుకున్నట్లు ఇతర శిష్యులు చెబుతున్నారు.