వనపర్తిలో సైబర్ ముఠా కీలక నిందితుడి అరెస్ట్

వనపర్తిలో సైబర్ ముఠా కీలక నిందితుడి అరెస్ట్

వనపర్తి, వెలుగు: ధని లోన్​ యాప్​ ద్వారా రూ.2కోట్లు కాజేసిన సైబర్​ నేరస్థుల ముఠా కీలక నిందితుడిని అరెస్ట్  చేసి రిమాండ్​కు పంపినట్లు ఎస్పీ రావుల గిరిధర్​ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. గోపాల్​పేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన శివకు సైబర్​ నేరగాళ్లు ఫోన్​ చేసి విడతల వారీగా రూ.32,125 ఫోన్​ పే ద్వారా కాజేశారు.

ఇంకా డబ్బులు పంపాలని డిమాండ్​ చేయడంతో, అనుమానం వచ్చి బాధితుడు సైబర్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సైబర్​ సెక్యూరిటీ డీఎస్పీ రత్నం, వనపర్తి సీఐ కృష్ణయ్య, గోపాల్​పేట ఎస్సై నరేశ్​ ఫోన్​ నంబర్​ను ట్రేస్​ చేసి సూర్తి తండాకు చెందిన వెంకటేశ్​గా గుర్తించారు. ఢిల్లీ, బీహార్, కోల్​కతా రాష్ట్రాల్లోని సైబర్​ నేరగాళ్లతో కలిసి ఫోన్లు చేసి డబ్బులు వచ్చాక, వారికి పంపేవాడు. వారు కమీషను ఇచ్చినట్లు శివ ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.4 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సైబర్  క్రైమ్  ఎస్సై రవి ప్రకాశ్, సిబ్బంది ఉన్నారు.