కృష్ణయ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి

ఇటీవల జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని టీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలోని కృష్ణయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన నాగేశ్వరరావు.. కృష్ణయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలందరు కోరుతున్నారన్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం దురదృష్టకరమని చెప్పారు. అధికారులు, పోలీసులు వారి మీదున్న నమ్మకాన్ని , బాధ్యతను గుర్తించి వారి విధులు నిర్వహించాలని కోరారు. కృష్ణయ్య హత్య ను సమర్ధిస్తే ఆయన అంతరాత్మ ఘోషిస్తుందన్నారు. వ్యవస్థల న్యాయం తరుపున ఉండి కేసును ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను శిక్షించాలని ఈ సందర్భంగా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సాహించదన్న ఆయన.. దోషులకు శిక్ష పడేందుకు నాసాయ శక్తులా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ కేసులో కొందరు నిందితులు అరెస్టయ్యారని వస్తున్న ప్రచారంపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. హత్య చేసినప్పుడు ఉపయోగించిన ఆయుధాలు, బట్టలు అక్కడే స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వీరిని సీక్రెట్​ప్లేస్​లో ఇంటరాగేషన్​ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతుండగా, పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ఒకవేళ అరెస్ట్ ​చేసినట్టు చూపిస్తే 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కాబట్టి బయటకు పొక్కనీయడం లేదంటున్నారు. కాగా, కృష్ణయ్య హత్య కేసులో మండలంలోని ఓ టీఆర్ఎస్​లీడర్ కు సంబంధం ఉందేమో అన్న అనుమానంతో పోలీసులు గురువారం ఆయన ఇంట్లో సోదాలు చేశారు. పోలీసులు మాత్రం తనిఖీల విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.