దొంగతనం ఆరోపణలు.. మహిళను చితకబాదిన పోలీసులు

దొంగతనం ఆరోపణలు.. మహిళను చితకబాదిన పోలీసులు
  • దొంగతనం పేరుతో అదుపులోకి తీసుకుని విచారణ

బంగారం  దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు దళిత మహిళ అని చూడకుండా దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన సైబరాబాద్  కమిషనరేట్ పరిధిలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. గత నెల 24 షాద్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్య తో పాటు వారి 13 ఏళ్ళ కుమారుడు జగదీష్ నీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. అనంతరం భర్తను వదిలేసి డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలు సునీత ను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టడం తో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సీఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడం తో స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఇంటికి పంపించారని బాధితురాలు వాపోతోంది. 

24 తులాల బంగారం, 2 లక్షల నగదుకు గానూ కేవలం ఒక తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళ పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చెయ్యకుండా ఇంటికి పంపించి వేయడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తుంది. ఒక వేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్ తరలించాలి గానీ  ఒక దళిత పేద మహిళ పై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.