కోర్టు నుంచి పారిపోయిన నిందితుడు.. కోదాడలో ఘటన

పోలీసు చొక్కా ఒంటిపై ఉండాలని అందరూ కల కంటారు. మరి, ఆ ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో తెలుసా..! పోలీస్ ఉద్యోగమంటే కత్తిమీద సాములాంటిది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ నిమిషంలో ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందే ఎవరూ ఊహించలేం. కావున ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. కాదు.. కూడదు.. ఏముందిలే అన్నట్లు ఏమరపాటుగా వహిస్తే ఇదిగో ఇలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుంది. దొంగతనం కేసులో అరెస్టైన ఓ నిందితుడు పోలీసుల చెర నుంచి పారిపోయాడు.. అది కూడా కోర్టు ఆవరణలో.. ఈ ఘటన కోదాడ కోర్టులో చోటుచేసుకుంది. 

 ఓ దొంగతనం కేసులో మామిడి గోపి అనే నిందితుడు జైలు కెళ్లాడు. కేసు విచారణలో భాగంగా సూర్యాపేట ఏఆర్ పోలీసులు అతన్ని ఖమ్మం జిల్లా జైలు నుంచి కోదాడ కోర్టుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చే సమయంలో నిందితుడి చేతికి బేడీలు వేశారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కాని, నిందితుడు తన చేతులకున్న బేడీలతో సహా పరారయ్యాడు. కోర్టు ఆవరణలోనే నిందితుడు పారిపోవడంతో ఈ ఘటన చర్చనీయాంశం అవుతోంది. నిందితుడికి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.