ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ATS, GST, IT అధికారుల పేరుతో ఓ కేటుగాడు లక్షల రూపాయలు వసూలు చేశాడు. బీటెక్ చదువుతున్న సదరు మోసగాడిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు.
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన శివ కరణ్ కాగ్నే ఎల్పీయూ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు చేస్తున్నాడు. అయితే తాను నేర్చుకున్న విద్యను ఉపయోగించి మోసాలకు తెగబడ్డాడు. గత నెల 31న ఐటీ అధికారినని చెప్పి జిల్లాకు చెందిన ఓ బట్టల వ్యాపారిని బెదిరించాడు.
బాధితుని నుంచి శివ కరణ్ రూ. 5 లక్షలు వసూలు చేశాడు. అసలు విషయం తెలుసుకున్న సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పంజాబ్ జలంధర్ లోని ఎల్పీయూ యూనివర్సిటీ నుంచి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.35 లక్షలు, సెల్ ఫోన్ రికవర్ చేశారు.