చందుర్తి, వెలుగు : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఓ నిందితుడు చందుర్తి పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం గర్శకుర్తికి చెందిన ఓ నిందితుడు గంజాయి రవాణా చేస్తుండగా ఇదే మండలంలోని మరిగడ్డ శివారులో సీసీఎస్పోలీసులు పట్టుకుని చందుర్తి పోలీసులకు అప్పగించారు. విచారణ తర్వాత రిమాండ్ కు పంపించేందుకు పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి నిందితుడు టాయిలెట్వస్తుందని చెప్పడంతో కానిస్టేబుల్ అతడిని బయటకు తీసుకువచ్చాడు. పక్కనే ప్రహరీ ఉండడంతో కానిస్టేబుల్ చూసేంతలో గోడ దూకి పరారయ్యాడు. సదరు కానిస్టేబుల్ఇతర సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఎస్సై, సీఐకి చెప్పారు. ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై చందుర్తి ఎస్ఐ శ్రీకాంత్‌ను వివరణ కోరగా నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.