మా ఆర్డర్స్​తోనే ఏసీడీ వసూలు చేస్తున్నరు : తన్నీరు శ్రీరంగారావు

  • అప్పుడే రైతులు  ఎంత కరెంట్​ వాడారో తెలుస్తది 
  • స్టేట్​ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​ చైర్మన్​ తన్నీరు శ్రీరంగారావు 

ఖమ్మం టౌన్, వెలుగు : ‘వ్యవసాయ మోటార్లకు కాకుండా ట్రాన్స్ ఫార్మర్ల వద్ద విద్యుత్ మీటర్లు పెడుతం. దీనివల్ల రైతులు ఎంత కరెంట్​వాడారో తెలుస్తది. దీనిద్వారా రైతులపై ఎలాంటి అదనపు భారం పడదు.  మహారాష్ట్రలో ఈ ప్రయోగం సక్సెస్​ అయింది.’ అని తెలంగాణ స్టేట్​ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​(టీఎస్​ఈఆర్సీ) చైర్మన్  తన్నీరు శ్రీ రంగారావు అన్నారు.  ఖమ్మంలోని డీపీఆర్సీ బిల్డింగ్ లో శనివారం విద్యుత్ వినియోగదారులతో టీఎస్​ఈఆర్సీ ముఖాముఖీ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రంగారావు, కమిషన్​ టెక్నికల్ మెంబర్​మనోహర్ రాజు, ఫైనాన్స్ మెంబర్ బండారు కృష్ణయ్య పాల్గొన్నారు. ఈఆర్సీ ఆదేశాలతోనే అడిషనల్​కన్జంప్షన్​డిపాజిట్(ఏసీడీ) వసూలు చేస్తున్నారని, లోడ్ కెపాసిటీ ఆధారంగా చార్జీలు విధిస్తున్నామని శ్రీరంగారావు వివరించారు. సెంట్రల్ యాక్ట్ 43 ప్రకారం దీనిని అమలు చేస్తున్నామని, ఆ మొత్తాన్ని డిపాజిట్ గా ఉంచి వడ్డీ కూడా చెల్లిస్తామని, వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.

ప్రీ పెయిడ్ మీటర్లు వస్తే ఏసీడీ ఉండదని పేర్కొన్నారు. అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆఫీసర్లు స్పందించకపోతే వినియోగదారులు కన్జూమర్​ గ్రివెన్స్​రిడ్రసెల్​ ఫోరం(సీజీఆర్​ఎఫ్​) కు కంప్లయింట్​ చేయాలని ఆయన సూచించారు. పొలాల చుట్టూ కరెంట్​తీగలు అమర్చి పశువులు, మను షుల ప్రాణాలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చనిపోయినవారి ఫ్యామిలీకి బాధ్యుల నుంచే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇప్పిస్తామన్నారు. పదేండ్ల జైలు శిక్ష కూడా విధించేలా చట్టాన్ని తెచ్చినట్లు చెప్పారు. ఈ ప్రోగ్రామ్​లో వివిధ పార్టీల లీడర్లు, సర్పంచులు సమస్యలను మండలికి తెలిపారు. అయితే, జనరల్​పబ్లిక్​ హాజరయ్యేలా విద్యుత్ శాఖ ఆఫీసర్లు సరైన అవగాహన కల్పించకపోవడంతో ఈ ముఖాముఖీ ప్రజాప్రతినిధుల ప్రోగ్రామ్ గా మారిందని విమర్శలు వ్యక్తమయ్యాయి.