బిలియనీర్​ బాబా..ఆచార్య బాలకృష్ణ సంపద రూ.29,680 కోట్లు

బిలియనీర్​ బాబా..ఆచార్య బాలకృష్ణ సంపద రూ.29,680 కోట్లు
  • రాందేవ్‌‌ బాబా సహచరుడు ఆచార్య బాలకృష్ణ సంపద రూ.29,680 కోట్లు
  • పతంజలిలో 94 శాతం వాAటా
  • రోజుకి 15 గంటల పని
  • ఆదివారం సెలవు లేదు 
  • జీతం మాత్రం జీరో

వెలుగు బిజినెస్​ డెస్క్​ మనం చాలా మంది బాబాల గురించి వింటుంటాం. కానీ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే  బాబా.. బిలియనీర్​. అదే ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతోంది. అవును..మీరు చదువుతున్నది నిజమే. యోగా నేర్పించే ఒక గురువు బిలియనీర్​గా మారారు.  దేశమంతటా పేరొందిన యోగా గురువు బాబా రాందేవ్​కు కుడి భుజంగా ఉంటూ, పతంజలి పేరుతో ఎఫ్​ఎంసీజీ కంపెనీని సక్సెస్​ఫుల్​గా నడుపుతున్న ఆ బిలియనీర్ బాబా పేరు ఆచార్య బాలకృష్ణ. పతంజలి అంటే వెంటనే గుర్తొచ్చే బాబా రాందేవ్​కు ఆ కంపెనీలో ఒక్క షేరు కూడా లేదు. కానీ,  ఆచార్య బాలకృష్ణ కి మాత్రం కంపెనీలో 94 శాతం వాటా ఉంది. 

పతంజలి ఆయుర్వేద్​ కంపెనీకి చైర్మన్​,  సీఈఓ అయిన ఆచార్య బాలకృష్ణ 2017 లోనే హురున్​ ఇండియా రిచ్​లిస్ట్​లో 7 వ ప్లేస్​ పొందారు. ఫోర్బ్స్​ తాజా లెక్కల ప్రకారం ఇప్పుడు ఆయన సంపద విలువ ఏకంగా రూ. 29,680 కోట్లు. ఈ సంపదంతా ఆయనకు కంపెనీ నుంచి వచ్చినదే. 2006 లో బాబా రాందేవ్​, ఆచార్య బాలకృష్ణ, ఆచార్య కర్మవీర్​ కలిసి పతంజలి ఆయుర్వేద్‌‌​ను మొదలెట్టారు. ఇద్దరు డివోటీలు ఇచ్చిన కొద్దిపాటి అప్పునే పెట్టుబడిగా వాడారు. ఆదివారాలు సైతం పనిచేయడమే కాకుండా, రోజుకి 15 గంటలు పతంజలి కోసమే కష్టపడే ఆచార్య బాలకృష్ణ కంపెనీ నుంచి తీసుకుంటున్న జీతం మాత్రం సున్నా.

పతంజలి గురించి....

ఎఫ్ఎంసీజీ రంగంలో సంచలనంగా మారిన పతంజలి కంపెనీ కిందటి ఫైనాన్షియల్​ ఇయర్లో రూ. 886.44 కోట్ల లాభం సంపాదించింది. 2019–20 లో కంపెనీ టర్నోవర్​ రూ. 9,022 కోట్లు. రాబోయే అయిదేళ్లలో రూ. 50 వేల కోట్ల టర్నోవర్ మార్కును, రూ. 5 వేల కోట్ల లాభాన్ని అందుకోవాలనేది  కంపెనీ టార్గెట్.

కొత్త ప్రొడక్టులు....

సబ్బులు, టూత్​పేస్టులు, షాంపూలు అమ్ముతున్న ఈ పతంజలి కంపెనీ ఇప్పుడు ప్రీమియం డ్రైఫ్రూట్స్​, ప్రీమియం బిస్కట్స్​, కుకీస్  కూడా లాంఛ్​ చేయాలనుకుంటోంది. యోగా నేర్పడంతోపాటు, ఆయుర్వేదాన్ని ప్రమోట్​ చేస్తూ– గురువులుగా పరిచితమైన బాబా రాందేవ్​, ఆచార్య బాలకృష్ణ  దేశంలోని లక్షలాది మందిపై తమ ప్రభావాన్ని చూపెడుతున్నారు.