
ఆచార్య నాగార్జునుడిని రెండో తథాగతుడు, రెండో బుద్ధుడిగా పిలుస్తారు. ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధార గ్రంథం లంకావతార సూత్రం. ఈ గ్రంథం ప్రకారం ఆచార్య నాగార్జునుడు వేదలి అనే గ్రామంలో జన్మించాడు. వేదలి తెలంగాణలోనే ఉండి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం.
చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ప్రకారం నాగార్జునుడు దక్షిణ కోసల ప్రాంతానికి చేరువలో నివసించాడు. నాగార్జునకొండ, అమరావతిలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి సర్వవిద్యలను బోధించాడు. ఈయన శ్రీపర్వతంలో తన పేరుతో నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు. ఇది భారతదేశంలోనే రెండో విశ్వవిద్యాలయం. మొదటిది తక్షశిల. ఆచార్య నాగార్జునుడు ఆంధ్ర దేశంలో మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరింపజేశాడు. ఇతను నాలుగో బౌద్ధ సంగీతికి హాజరయ్యాడు.
- నాగార్జునుడు ఆంధ్ర దేశంలో మహాయాన బౌద్ధమతాన్ని విస్తరింపజేశాడు. ఈయన నాలుగో బౌద్ధ సంగీతికి హాజరయ్యాడు.
- మహాయానంలో రెండు కొత్త తత్వాలను ప్రారంబించాడు. అవి.. మాధ్యమిక వాదం, శూన్యవాదం.
- నాగార్జునుడు ఆత్మతత్వాన్ని ఆమోదించలేదు. దీనినే శూన్యవాదం అంటారు. శూన్యవాదంలో సాపేక్ష సిద్ధాంతం వంటి ఐన్‌స్టీన్ కాన్సెప్ట్స్ ఉండటం వల్ల నాగార్జునుడిని భారత ఐన్‌స్టీన్ గా పిలుస్తారు.
- ఆచార్య నాగార్జునుడు అమరావతి మహాచైత్యానికి ప్రాకారం, శ్రీశైలం వద్ద శైల మండపాలను నిర్మించాడు.
- నాగార్జునుడు సంస్కృతంలో 24 గ్రంథాలు రాశాడు. అవి.. సుహృల్లేఖ, రత్నావళి, ప్రజ్ఞాపారమిత శాస్త్రం, ఆరోగ్య మంజరి, రస రత్నాకరం, రసవాదం, ద్వాదశనికయము, దేశభూమికసూత్ర, వివిధ సమానసూత్ర, శూన్యసప్తతి, మాధ్యమిక కారిక, అష్టసాహస్రిక, విగ్రహవ్యార్తిని.
బౌద్ధ మత కట్టడాలు
ఆరామం చుట్టూ తోటలు, ప్రార్థనకు, సమావేశానికి, వ్యాయామానికి సదుపాయాలు ఉన్న విహారాలను ఆరామాలు అంటారు. లేదా స్తూపం, విహారం, చైత్యం, విద్యాలయం ఒకేచోట ఉంటే ఆ ప్రాంతాన్ని ఆరామం అంటారు. చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ తన గ్రంథమైన సి–యూ–కిలో ఆంధ్ర దేశంలో 40 సంఘారామాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. శ్రీ పర్వత సంఘ ఆరామం ఆచార్య నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి 1500 గదులతో నిర్మించారు. ఉదాహరణకు నందలూరి ఆరామం, శ్రీ పర్వతం.
Also Read : మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం
శాతవాహనులు వాస్తు శిల్పకళా రంగంలో నూతన శకం ప్రారంభించారు. ఆంధ్రలో తొలి కట్టడాలు బౌద్ధ సంప్రదాయానికి చెందినవి. బౌద్ధం దక్కన్కు వ్యాప్తి చెందడం వల్ల శాతవాహనులు అనేక స్తూపాలు, విహారాలు, చైత్యాలు నిర్మించారు. బౌద్ధ కట్టడాలే వాస్తు శిల్పానికి నిదర్శనం.
స్తూపం
స్తూపం అంటే బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించే కట్టడం. అశోకుడు ఆంధ్రలో నిర్మించిన మూడు స్తూపాలను హుయాన్‌త్సాంగ్ ప్రస్తావించాడు. అవి.. అమరావతి, భట్టిప్రోలు, శాలిహుండం. ఈ స్తూపాలను శాతవాహనులు నిర్మించి వాటిని విస్తరింపజేశారు. వీటిలో అత్యంత ముఖ్యమైంది అమరావతి స్తూపం. ఇది అశోకుని కంటే ముందు నిర్మించిన ఒక చిన్న మట్టి స్తూపం. దీనిని అశోకుడు నల్లరాయితో నిర్మించి బుద్ధుని దాతువును నిక్షిప్తం చేశాడు. మొదట మూల స్థానంలో అవశేషాలను నిక్షిప్తం చేసి, చుట్టూ గుండ్రంగా మేథి(సిలిండర్) నిర్మిస్తారు. దానిపై అర్ధగోళాకారపు డోమ్‌ను నిర్మిస్తారు. చుట్టూ ప్రదక్షిణ పథం, ఆయక స్తంభాలు, ప్రాకారాలు, ద్వారాల చుట్టూ తోరణాలను నిర్మిస్తారు. చివరగా దీనిపైన హార్మిక ఛత్రం వంటివి అలంకరిస్తారు.
దాతు గర్భితాలు
బుద్ధుడి శారీరక అవశేషాలపైన నిర్మించిన స్తూపాలు. అశోకుడు ఉత్తర భారతదేశంలోని 12 దాతుగర్భ స్తూపాలను తొలగించి, వీటిలో ఉన్న బుద్ధుడి అవశేషాలు సేకరించి దేశం మొత్తం మీద 84,000 స్తూపాలు నిర్మించాడు. ఆంధ్ర దేశంలోని దాతు గర్భితాలు అమరావతి, శాలిహుండం, ఘంటశాల, జగ్గయ్యపేట, భట్టిప్రోలు.
పారిబోజకాలు
గొప్ప బౌద్ధ భిక్షువులు వాడిని వస్తువులపై నిర్మించిన కట్టడాలు. 2015, జనవరి 6న ఫణిగిరిలో బౌద్ధ భిక్షువులు వినియోగించిన వస్తువులు కనుగొన్నాయి. ఉద్దేశిక స్తూపాలు బుద్ధుడిపై భక్తిభావాలు వెల్లడిస్తూ నిర్మించిన స్తూపాలను ఉద్దేశిక స్తూపాలు అంటారు. ఉదాహరణకు లింగాలమెట్ట(అనకాపల్లి), గుంటుపల్లి.
చైత్యం
ఇది బౌద్ధుల ప్రార్థన మందిరం. అనేక స్తంభాలు కలిగిన విశాలమైన గదిని ఇందుకోసం తొలపిస్తారు. ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ముఖ్యమైన చైత్యాలు కార్లే, కన్హేరి, నాసిక్, బేడ్స, ఖాజీ, గుంటుపల్లి.
విహారం
ఇవి దీర్గ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో ఉంటాయి. విహారాలు వరండాను కలిగి ఉంటాయి. ఇవి బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలు. వీటిని సంఘారామాలు అని కూడా వ్యవహరిస్తారు. ఉదాహరణకు కన్హేరి ప్రధాన విహారం. లోపల మందిరం, దానికి మూడు వైపులా వరుసగా గదులు, ప్రతి గదిలో భిక్షువులు నిద్రించడానికి రాతి బల్ల ఉంటుంది. విహారానికి మధ్యలో మధ్యశాల ఉంటుంది. ప్రతి 115 రోజులకు ఒకసారి మధ్యశాలలో బౌద్ధ సన్యాసుల ఉపోషద సమావేశాలు నిర్వహించేవారు.
గుహాలయ విహారాలు: అజంతా, గుమ్మడిదుర్రు, గుంటుపల్లి, అల్లూరు, కాన్హేరి.