గుమాస్తా, దినసరి కూలీ, బీడీలు చుట్టడం, అనాథ, చిరువ్యాపారం, పేదరికం ఇవేవి కాలేదు ప్రతిభకు ఆటంకం. తాము పేద కుటుంబంలోంచి వచ్చినా...తమ మనో ధైర్యం గొప్పదని వారు రుజువు చేశారు. తమను విజయం వరించిందని తెలిసినా కానరాని గర్వమే వారిని విజయాలకు బాటలు వేసింది. సాదాసీదా జీవన ‘ప్రయాణం’ ఒడుదొడుకులు ఎన్నైనా లక్ష్యం వైపే చూపు. చివరకు ఫలితం అమోఘం. వీరే దేశం గర్వించదగిన వ్యక్తులు.
ఇటీవల యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన టాప్ ర్యాంకర్లు. సివిల్స్ ఫలితాల్లో మూడవ ర్యాంకు నుంచి 995వ ర్యాంకు వరకు సొంతం చేసుకున్న తెలుగు విద్యార్థుల ప్రతిభ అమోఘం. 1000 లోపు ర్యాంకులు సాధించినవారిలో కొందరు ఒక ప్రయత్నంలో విజయం సాధించగా, మరికొందరు ఎటువంటి కోచింగ్ ఇనిస్టిట్యూట్ కు వెళ్లకుండా విజయాన్ని పొందారు. ఇంకొందరు సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే సీనియర్స్ ను మెంటార్ గా ఎంచుకొని ఆశించిన ఫలితం అందుకున్నారు. ర్యాంకులు సాధించినవారంతా లక్ష్యాన్ని గురిపెట్టుకుని అహోరాత్రులు శ్రమించినవారే. విజేతలుగా నిలిచిన తెలుగు విద్యార్థుల్లో ఎక్కువమంది పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. వీరి ప్రతిభ పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్వగ్రామ, స్వప్రాంత, స్వరాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో సమాజాన్ని నడిపించే బాధ్యత గల కేంద్ర ప్రభుత్వ సర్వీసు అధికారులుగా వీరు మారనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ తదితర 21 కేటగిరీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన యూపీఎస్సీ ర్యాంకర్లంతా తెలుగు ప్రజల కీర్తిని మరోమారు దేశానికి చాటి చెప్పారని హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
ర్యాంకర్లతో టీశాట్ ముఖాముఖి
యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల అనంతరం వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన అభ్యర్థులతో టీశాట్ నెట్వర్క్ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పలువురు ర్యాంకర్ల మనోగతాన్ని తెలుసుకున్న టీశాట్ ఒకింత ఆశ్చర్యానికి, మరికొంత ఆనందానికీ గురైంది. మా అమ్మానాన్నలు కూలి పనిచేసే వారు అని ఒక ర్యాంకరు చెప్పగా, అసలు చిన్న వయస్సులోనే అమ్మానాన్నలు చనిపోతే పట్టుదలతో ర్యాంకు సాధించానని మరొకరి మాట, కుటుంబ పోషణ కోసం ప్రయివేటు ఉద్యోగం చేస్తూ ర్యాంకు సాధించి, ఇంటర్వ్యూకు సైతం డ్యూటీ నుంచే రావడం ఆశ్చర్యపరచడమే కాదు. వారి నిబద్ధతను గుర్తుచేస్తుంది. ఆశ్చర్యం అందరి వంతైంది. సాఫ్ట్వేర్ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సాయి కిరణ్ తాను 27వ ర్యాంకుసాధించినప్పటికీ సింప్లిసిటీతో పాటు చేస్తున్న ఉద్యోగాన్నీ వదులుకోలేదు. ఇంటర్వ్యూ సందర్భంగా అతని కుటుంబ నేపథ్యం తెలుసుకున్న ప్రతిఒక్కరూ అతని ప్రతిభ, సిన్సియారిటీకి హ్యాట్సాఫ్ చెప్పారు.
నానమ్మే అండగా.. సివిల్స్‌లో ర్యాంక్
కొందరు సివిల్స్ ర్యాంకర్ల జీవితగాథ ప్రత్యేకం అనడానికి 780వ ర్యాంకర్ మూలగాని ఉదయకృష్ణారెడ్డి ఉదాహరణ. నాలుగున్నరేండ్ల వయస్సులోనే అమ్మ, 18వ ఏట నాన్నను కోల్పోయి కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి, ఉన్నతాధికారుల ఒత్తిడులు తట్టుకొని, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ ఆలనలో సివిల్ ర్యాంకు సాధించిన ఉదయకృష్ణారెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ర్యాంకర్ తండ్రి లారీ డ్రైవర్, తల్లి బీడీ కార్మికురాలు. తాను ఉద్యోగం చేయడం తప్పనిసరి. అయినా, మొక్కవోని ధైర్యంతో ఆరవసారి ఫలితాన్ని సాధించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక సివిల్స్ పరీక్షలు రాయలేనన్న నిరుత్సాహంలోంచి ర్యాంకు సాధించిన మన తెలుగోడి ఆత్మస్థ్రైర్యానికి వెలకట్టలేం. మరో ర్యాంకర్ మెరుగు కౌశిక్.. తాను ఏ మెంటార్‌నూ ఆశ్రయించలేదు. పుస్తకాలే అతనికి స్ఫూర్తినిచ్చాయి. ఆన్ లైన్ వెబ్ సైట్లే అతనికి మార్గదర్శకం అయ్యాయి. వెరసి 82వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ వాసి చందనా జాహ్నవి జర్నీ వింతే. తాను విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరి, తాతయ్య అడుగుజాడల్లో నడిచేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ర్యాంకు రాలేదని నిరాశ చెందకుండా చివరి ప్రయత్నంలో 50వ ర్యాంకు సాధించి తన పట్టుదలను ప్రూవ్ చేసుకున్నారు. రాంరెడ్డిపేట్ రజనీకాంత్, చిట్టపులి నరేంద్ర పాదల్ సైతం పేదరికాన్ని జయించి ర్యాంకు సాధించిన వ్యక్తులే. సాయికిరణ్, కొయ్యాడ ప్రణయ్ కుమార్, కన్నెబోయిన శ్రీనివాసులు, గాడిపర్తి సాయి దర్శిణి, రావూరి సాయి అలేఖ్య, పి. ధీరజ్ రెడ్డిలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ర్యాంకులు సాధించిన 38మందివీ ఇవే విజయ గాథలు.
టాప్ ర్యాంక్ మనదే..
ఒకప్పడు ఐఏఎస్ అంటే...అబ్బో అనే వారు మన తెలుగువారు. కానీ, ఇప్పుడు తెలుగు ప్రజల హక్కుగా సివిల్స్ర్యాంక్ మారింది. సివిల్ టాప్ ర్యాంక్ మనదే అని గతంలో కరీంనగర్ జిల్లావాసి దురుశెట్టి అనుదీప్ కుమార్ ఢంకా బజాయించగా, నల్గొండ జిల్లా వాసి ఉమాహారతి గతంలోనూ మూడవ ర్యాంకు సాధించి తెలంగాణ పవరేంటో దేశానికి గుర్తు చేశారు. 2024 సివిల్స్ ఫలితాల్లోనూ మహబూబ్ నగర్ జిల్లా వాసి దోనూరు అనన్యరెడ్డి మూడవ ర్యాంకు సాధించి తెలుగువారి సత్తా ఏంటో చాటారు. జనాభా ప్రాతిపదికన తెలుగు విద్యార్థులు సాధించిన ర్యాంకులు దేశంలోనే
తెలంగాణాను మొదటి స్థానంలో నిలిపాయి. తెలుగువారి ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషితో పాటు తెలుగు రాష్ట్రాల్లో పటిష్టమైన విద్యా వ్యవస్థ ఫలితంగా భవిష్యత్‌లో ప్రతిఏటా మెజారిటీ సివిల్ ర్యాంకులు తెలుగు విద్యార్థుల వశం కానున్నాయనడంలో అతిశయోక్తి లేదు. గతంలో ఒకటి, రెండు సివిల్ ర్యాంకులను తలదన్ని మెజారిటీ ర్యాంకులు సాధించి దేశానికే మార్గదర్శులమౌతామని మేధావుల అభిప్రాయాలు నిజం కాబోతున్నాయన్నది స్పష్టమౌతుంది.
ఆడంబరాలకు అతీతంగా ఐఏఎస్ ర్యాంకర్
మరో రోజు 21 ఏళ్ల యువతి తాను బుక్ చేసుకున్న క్యాబ్(ఆటో) లొకేషన్లో దింపినప్పటికీ తాను చేరాల్సిన కార్యాలయం కోసం నిలబడ్డ చోటు నుంచే పరిశీలనగా చూస్తోంది. ఇంతలో అటువైపు నుంచి కారులో వస్తున్న ఓ అధికారి ఆ యువతిని గుర్తించి మీరు వెతుకున్నది మా ఆఫీసు కోసమేనంటూ తన కారులో తీసుకువెళ్లారు. ఆ యువతే యూపీఎస్సీ మూడవ ర్యాంకర్ అనన్యరెడ్డి. అంటే...ఆమెకు తెలుసు తాను త్వరలో ఐఏఎస్ అధికారిణిగా ఎంపిక కాబోతున్నానని అయినా ఆడంబరాలకు వెళ్లలేదు. తన స్నేహితురాలితో కలిసి ఆటోలో ఇంటర్వ్యూకు వచ్చారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి మారుమూల ప్రాంతంలో చిన్న ప్రయివేటు పాఠశాలలో విద్యాభ్యాసం, ఆ తరువాత ఇంటర్, డిగ్రీ పట్టభద్రురాలిగా సివిల్స్ మూడవ ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి విజయగాథ అందరికీ ఆదర్శం.
ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు
టీశాట్‌లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ప్రారంభం కావాల్సిన సమయం. కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ కోసం కార్యాలయ సిబ్బంది ప్రధాన ముఖద్వారం వైపు ఎదురు చూస్తున్నారు. అతిథి ఏ కారులో వస్తారోనని..ఇంతలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ కుర్రాడు హెల్మెట్ తీస్తూ సెక్యూరిటీ వద్దకు వచ్చాడు. ఎవరని సెక్యూరిటీ ప్రశ్నించగా...లైవ్ ప్రొగ్రామ్‌లో పాల్గొనడానికి వచ్చానని చెపుతూ ఎంట్రీ బుక్‌లో తన పేరు నమోదు చేయబోయాడు. అప్పటికే అతని కోసమే ఎదురుచూస్తున్న టీశాట్ సిబ్బంది తొలుత ఆశ్చర్యానికి గురైనా తరువాత స్వాగతించారు. అతనెవరో కాదు. యూపీఎస్సీ ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లా వాసి నందాల సాయికిరణ్.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టి-శాట్, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యకుడు