18ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి.. తల్లిదండ్రులపై కూడా..

18ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి.. తల్లిదండ్రులపై కూడా..

మహిళల భద్రత కోసం, మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా... స్కూళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో స్త్రీలను గౌరవిద్దాం అంటూ బాధ్యతను గుర్తు చేస్తున్నా కూడా సమాజంలో మార్పు రావట్లేదు.తరచూ ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనకు సంబంధించిన వార్తలు వినాల్సి వస్తోంది. మొన్న కేరళలో మహిళా డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన మరువక ముందే మరో యువతిపై యాసిడ్ దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్ లో చోటు చేసుకుంది ఈ దారుణం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం నాసిక్ జిల్లాలోని మాలెగావ్‌లోని ఇస్లామాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో  గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 18ఏళ్ళ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యువతికి తీవ్ర గాయాలయ్యాయి .

ఈ ఘటనలో ఆమె తల్లిదండ్రులు కూడా గాయపడ్డారు.ముగ్గురు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు, యువతిపై హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోశాడు. ఆ తర్వాత పారిపోయే క్రమంలో ఆమె తల్లిదండ్రులపై కూడా యాసిడ్‌ పోశాడు ఆగంతకుడు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.