
ఎన్‌టీఆర్ జిల్లాలోని ఐతవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహిత సహా ఆమె కుమారుడు, మరో మహిళపై ఓ దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన వారిని స్థానికులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని సమాచారం.
ఐతవరంకు చెందిన వివాహిత(28)కు నెల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ మనీసింగ్‌తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే గతకొద్ది రోజులుగా బాధిత మహిళ మనీసింగ్‌ను దూరం పెట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన దుండగుడు.. తెల్లవారుజామున నిద్రిస్తుండగా వివాహితతో సహా ఆమె కుమారుడు. మరో మహిళపై యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.