ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలవడాన్ని కాలుష్యం అంటారు. వాతావరణానికి హాని కలుగజేసే పదార్థాల చేరికను కాలుష్యంగా పరిగణించవచ్చు. మానవుడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వాతావరణం సమతుల్యత దెబ్బతింటున్నది ద్వారా పర్యావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలుష్య కారకాలు ముఖ్యంగా రెండు రకాలు. 1. ప్రాథమిక కాలుష్య కారకాలు 2. ద్వితీయ కాలుష్య కారకాలు. ఇంధనాలు మండించడం ద్వారా పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలను ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోకి ప్రవేశించి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడే పదార్థాలను ద్వితీయ కాలుష్యకారకాలు అంటారు. కాలుష్యానికి కారణమయ్యే కారకాలను కాలుష్యకాలు అంటారు.
పర్యావరణాన్ని ప్రభావితం చేసే అంశాలను ఆధారంగా చేసుకొని కాలుష్యాన్ని వాయు, నీటి, శబ్ద కాలుష్యంగా వర్గీకరించారు.
వాయు కాలుష్యం : మానవుల చర్యల వల్ల గానీ ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల గానీ వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దాన్ని వాయు కాలుష్యం అంటారు. కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా కాలుష్యకారకాలు వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి. ఉదాహరణకు అగ్ని పర్వతాలు బద్ధలవడం, అడవుల దహనం, ఇసుక తుపానులు. పొడిగాలిలో వాయు ఘటకాల ఘన పరిమాణాలు నత్రజని 78.09శాతం, ఆక్సిజన్ 20.94శాతం, ఆర్గాన్ 0.93శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 0.03శాతం ఉంటాయి. వాయు కాలుష్యకాలు అన్ని జీవులకు హాని కలిగిస్తాయి. మానవుల, జంతువుల శ్వాసవ్యవస్థకు హాని కలిగిస్తాయి.
ప్రధాన వాయు కాలుష్యకాలు
ఎ. కార్బన్ మోనాక్సైడ్(CO) : అసంపూర్తిగా మండించిన శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతుంది. పెద్ద నగరాలు, పట్టణాల్లో వాహనాలు కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యానికి ముఖ్య కారణం. హీమోగ్లోబిన్‌కు కార్బన్ మోనాక్సైడ్‌తో బలమైన బంధక బలం ఉంటుంది. అందువల్ల ఇది ఆక్సిజన్ రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ గాఢతలో తలనొప్పి, మసకబారిన దృష్టి, ఎక్కువ గాఢతలో కోమాకు దారితీసి చివరకు మరణం సంభవిస్తుంది.
బి. కార్బన్ డై ఆక్సైడ్ : గ్లోబల్ వార్మింగ్‌కు ముఖ్య కాలుష్య కారకం కార్బన్ డై ఆక్సైడ్. అన్ని రకాల జీవులు శ్వాసక్రియ జరిపేటప్పుడు CO2 వాయువును విడుదల చేస్తాయి. వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ, వాహనాలు, విమానాలు, గాసోలిన్ వంటి శిలాజ ఇంధనాన్ని మండించడం వంటి మానవ చర్యల ద్వారా CO2 ఆందోళన కలిగించే కాలుష్యకారకంగా ఉంది.
సి. సల్ఫర్ డై ఆక్సైడ్ : కార్బన్ మోనాక్సైడ్ తర్వాత అత్యధిక మోతాదులో విడుదలయ్యే గాలి కాలుష్యకారకం సల్ఫర్ డై ఆక్సైడ్. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఈ వాయువు అధికంగా విడుదల అవుతున్నది. ప్రపంచంలో అత్యధికంగా SO2ను విడుదల చేస్తున్న దేశం ఇండియా. ఈ వాయువు వల్ల చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లుతున్నది. మానవునిలో ఉబ్బసం, శ్వాసవ్యాధులకు కారణం. అలాగే ఆమ్లవర్షాలకు కారణం ఈ కాలుష్యకారకమే.
నైట్రోజన్ ఆక్సైడ్ : ఇవి ప్రాథమిక కాలుష్యకారకాలు. ఇవి ప్రధానంగా ఆటో మొబైల్ ఉద్గారాల ద్వారా వెలువడుతాయి. దీనివల్ల పంటపొలాల్లో కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని ఉత్పత్తి తగ్గుతుంది. ఇది శ్వాసనాళానికి, కళ్లకు తీవ్రమైన మంటను కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయుకాలుష్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 6న జాతీయ వాయుకాలుష్య సూచికను ప్రారంభించింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే 20 మొదటి అత్యంత కాలుష్య నగరాల్లో 13 నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు గుర్తించారు. మన దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి 2020 ఏప్రిల్ నుంచి జాతీయ స్థాయిలో భారత్ స్టేజ్–VI(BS-VI)ను వాడుతున్నారు.
జల కాలుష్యం : అవాంఛిత కారకాలు నీటిలో చేరడం వల్ల నీటి భౌతిక, రసాయన, జీవసంబంధ స్థితులు మారడాన్ని జల కాలుష్యం అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ప్రమాదకరమైన సమస్యగా మారింది. ఆర్సెనిక్, ఫ్లోరిన్, నైట్రేట్ల వంటి వాటిలో భూగర్భజలం కలుషితమై ప్రమాదకరంగా మారుతుంది. కలుషితమైన నీటిలో ఆక్సిజన్ తగ్గించే చర్యనే యూట్రిఫికేషన్ అంటారు. కలుషితమైన నీటిలోని మిథైల్ మెర్క్యురితో కూడిన కలుషితమైన ఆహారం తినడం వల్ల జపాన్‌లో చేపలకు మినమాటా వ్యాధి, కాడ్మియంతో ఇటాయ్ ఇటాయ్ వ్యాధి, తాగునీటిలో అధిక నైట్రేట్ కారణంగా బ్లూబేబీ సిండ్రోమ్ వ్యాధులు సంక్రమిస్తాయి. నీటిలో ఫ్లోరిన్ శాతం 1–5ppmను దాటినప్పుడు మానవులకు ఫ్లోరోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది.
గ్లోబల్ వార్మింగ్ : మానవుడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల వాతావరణంలోకి గ్రీన్హౌస్ వాయువుల విడుదల పెరిగి భూగోళం సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) అంటారు. భూతాపానికి కారణం మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోర్ కార్బన్స్, కార్బన్ డై ఆక్సైడ్. వాతావరణంలో CO2 పెరిగే కొద్దీ సముద్ర నీటిలో కరిగే CO2 మోతాదు కూడా పెరుగుతుంది. ఫలితంగా సముద్రపు నీటిలో కార్బోనికామ్లం పెరిగి నీరు ఆమ్లయుతంగా మారుతుంది. ప్రపంచ గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన రెండో ప్రధాన వాయువు మీథేన్. బయోగ్యాస్‌లో అత్యధికంగా ఉండే వాయువు మీథేన్. దీన్నే మార్ష్‌గ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అంటారు.
ఓజోన్ క్షీణత : భూమిని అతినీలలోహిత కిరణాల బారి నుంచి తప్పించే వాయువు ఓజోన్. ఓజోన్ ఫార్మూలా O3. దీన్నే డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. ఈ పరికరాన్ని డబ్సన్ స్పిక్టోమీటర్ అంటారు. ఓజోన్ పొర వాతావరణంలోని స్ట్రాటోస్పియర్లో ఉంది. ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా జరుపుతారు. క్లోరోఫ్లోర్ కార్బన్ల ప్రభావానికి గురై ఓజోన్ పొర క్షీణిస్తుంది.
ఆమ్లవర్షాలు : నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వాతావరణంలోని తేమతో చర్యనొంది నత్రికామ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లంగా మారి వర్షపునీటితో కలిసి భూమిని చేరడాన్నే ఆమ్లవర్షం అంటారు. ఆమ్లవర్షాన్ని మొదటిసారిగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో గుర్తించారు. ఆమ్లవర్షాల కారణంగా చారిత్రక కట్టడాలపై పగుళ్లు ఏర్పడుతాయి. మానవుల్లో నాడీ వ్యవస్థ దెబ్బతిని వ్యాధులు సోకుతున్నాయి. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం డెసిబెల్. గరిష్ఠంగా 120 డెసెబుల్స్ ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు. 120 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉండే ధ్వనులు పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి మనవులకు ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి. రవాణాకు సంబంధించిన వాహనాల వల్ల అధిక ధ్వని కాలుష్యం కలుగుతోంది. పరిశ్రమల్లో పనిచేసే వారిలో ఎక్కువ మందికి శాశ్వత చెవిటితనం రావడాన్ని ఆక్యుపేషనల్ హియరింగ్ లాస్ అంటారు.
ఎ.వి. సుధాకర్ స్కూల్ అసిస్టెంట్, లింగంపల్లి (మంచాల) రంగారెడ్డి జిల్లా