
జైపూర్, వెలుగు: బోరు మోటర్ పంపులను చోరీ చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ మోహన్ తెలిపారు. మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్లో శ్రీరాంపూర్ సీఐ రమేశ్ బాబు తో కలిసి వివరాలను వెల్లడించారు. గత కొన్ని రోజులుగా మండలంలో బోరు మోటర్లు చోరీకి గురవుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రసూల్ పల్లె బస్టాప్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు చోరీ చేసిన బోరు మోటర్ పంపును బైక్‌పై పెట్టుకుని వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారిని మందమర్రి మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన కుమ్మరి వెంకటేశ్, కామెర రాజ్ కుమార్, సల్లూరి రాకేశ్‌గా గుర్తించారు. విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇప్పటివరకు 5 బోరు మోటర్ పంపులను చోరీ చేసి.. నాలుగింటిని అమ్మినట్లు చెప్పారు. మరోదాన్ని అమ్మేందుకు తీసుకెళ్తూ పోలీసులకు చిక్కారు. నస్పూర్‌కు చెందిన గుంజపడుగు తిరుపతికి అమ్మిన 3 మోటర్ పైపులను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. నిందితులతోపాటు బైక్ ను సీజ్ చేసి రిమాండు కు పంపినట్లు చెప్పారు.