వైరా,వెలుగు : కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పి మూడు బిళ్లల ఆట పేరుతో వృద్ధ దంపతుల వద్ద మూడు రోజుల కింద రూ.1.25 లక్షల సొత్తును దుండగులు చోరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు దొంగలను వైరా పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం వైరాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏసీపీ రెహమాన్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన బండారి ఏడుకొండలు, బండారి నాగేశ్వరరావు, బండారి అచ్చన్న, బండారి తిరుపతిరావు, సత్తెనపల్లికి చెందిన బిట్రా హనుమంతరావు
లావుడియా శ్రీనివాసరావు నాయక్ ఈ చోరీకి పాల్పడ్డారు. వీరిలో బండారి తిరుపతిరావు పరారీలో ఉండగా మిగిలిన ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ముఠాగా ఏర్పడి దొంగతనాలు, దోపిడీలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 2న పాపకొల్లుకు చెందిన వృద్ధదంపతులు వాంకోడ్ కేతా నాయక్, బాలిని జూలూరుపాడులో దింపుతామని వారి కారులో ఎక్కించుకున్నారు. మూడు బిళ్లల ఆటతో దంపతులకు మాయమాటలు చెప్పి వారితో ఉన్న రూ.5 వేలు, బాలి మెడలోని బంగారు గొలుసును తీసుకున్నారు.
అంతలోనే కారు తల్లాడ నుంచి సత్తుపల్లి వైపు వెళ్లడాన్ని గమనించిన దంపతులు జూలూరుపాడు వెళ్లేది ఇటు కాదని వారితో గొడవ పడ్డారు. దీంతో దొంగలు తల్లాడ లోని సత్తుపల్లి రోడ్డులో కారు నుంచి దంపతులను బయటకు నెట్టేశారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా మంగళవారం తెలంగాణలో మరో దొంగతనం చేసి గతంలో చోరీ చేసిన బంగారు గొలుసును అమ్ముకుందామని నిందితులు ఏపీ నుంచి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో టాటా సుమోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దొంగలను చింతకాని మండలం జగన్నాధపురం క్రాస్ రోడ్డు వద్ద వైరా సీఐ ఎన్ సాగర్
వైరా, తల్లాడ ఎస్సైలు మేడా ప్రసాద్, బి. కొండలరావు పోలీస్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారి నుంచి మూడు తులాల బంగారు గొలుసు, మూడు ముక్కల ఆట ఆడే మూడు బిళ్లలు, రెండు సెల్ ఫోన్లు, టాటా సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పరారీలో ఉన్న బండారి తిరుపతిరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడు రోజుల్లో కేసు ఛేదించిన వైరా సీఐ, వైరా, తల్లాడ ఎస్సైలను ఏసీపీ రెహమాన్ అభినందించారు. వారితోపాటు సిబ్బందికి రివార్డులు అందజేశారు.