ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్

ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏసీబీ 
  • ఏపీ, తెలంగాణలోని 14 ప్రాంతాల్లో అధికారుల సోదాలు
  • ఆయన ఇంట్లో రూ.38 లక్షల నగదు,60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం 
  • ఘట్​కేసర్‌‌‌‌లో 5 ప్లాట్లు, శామీర్‌‌‌‌పేట్‌‌లో విల్లా.. 2 బ్యాంక్​ లాకర్స్ గుర్తింపు
  • 17 ప్రాపర్టీల డాక్యుమెంట్స్ సీజ్​
  • సాహితీ ఇన్​ఫ్రా కేసులో భారీగా అవినీతికి పాల్పడ్డట్టు గుర్తించిన అధికారులు
  • ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.5కోట్ల ఆస్తులు, బహిరంగ మార్కెట్​లో 40 కోట్ల పైనే..!

హైదరాబాద్‌‌, వెలుగు:  సిటీ సెంట్రల్‌‌ క్రైమ్‌‌స్టేషన్ (సీసీఎస్​) ఏసీపీ ఉమామహేశ్వర్‌‌‌‌రావు ఏసీబీ వలకు చిక్కారు. అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోమంగళవారం ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలనుంచి హైదరాబాద్‌‌, వైజాగ్‌‌, అనకాపల్లి, నర్సీపట్నం సహా మొత్తం 14  ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌ అశోక్‌‌నగర్‌‌‌‌లోని ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లతో పాటు సీసీఎస్‌‌లోని చాంబర్‌‌‌‌లో తనిఖీలు చేశారు. ఆయన ఇంటి నుంచి రూ.38 లక్షలు, 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఘట్‌‌కేసర్‌‌‌‌లో 5 ప్లాట్లు, శామీర్‌‌‌‌పేట్‌‌లో విల్లాతోపాటు 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. మొత్తం 17  ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్తుల విలువ  ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.5 కోట్లు, బహిరంగ మార్కెట్​లో 40 కోట్ల పైనే.. అని అంచనా.

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరుకి చెందిన ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు1995 బ్యాచ్ ఎస్‌‌‌‌ఐ. సిటీ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ కాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అబిడ్స్‌‌‌‌ పీఎస్‌‌‌‌లో విధులు నిర్వర్తించారు. ఓ కేసు దర్యాప్తులో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. రాచకొండ కమిషనరేట్‌‌‌‌పరిధి జవహర్‌‌‌‌‌‌‌‌నగర్ పీఎస్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. పీఎస్‌‌‌‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ బాధిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, సస్పెన్షన్​కు గురయ్యారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీగా విధులు నిర్వహించారు. ఇక్కడ కూడా సివిల్ వివాదాల్లో తలదూర్చారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఉమామహేశ్వర్ రావును సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సిటీ కమిషనరేట్‌‌‌‌పరిధిలోని సీసీఎస్‌‌‌‌లో ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సాహితీ ఇన్‌‌‌‌ఫ్రా కేసులో భారీగా అవినీతి 

సీసీఎస్‌‌‌‌ ఎకనామిక్ అఫెన్సెస్‌‌‌‌ వింగ్‌‌‌‌ టీమ్‌‌‌‌3 ఏసీపీగా ఉమామహేశ్వర్​రావు పనిచేస్తున్నారు. ప్రీ లాంచింగ్ పేరుతో రూ.1,800 కోట్ల మోసాలకు పాల్పడిన సాహితీ ఇన్‌‌‌‌ఫ్రా కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఈ కేసులో కూడా బాధితులు, నిందితుల నుంచి  ఉమామహేశ్వర్​రావు భారీగా డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు ఎక్కడ పనిచేసినా ఆయా ప్రాంతాల్లో అవినీతికి పాల్పడినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే సాహితీ ఇన్‌‌‌‌ఫ్రా కేసు దర్యాప్తులో కూడా అక్రమాలకు పాల్లడ్డట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలో సందీప్‌‌‌‌ రెడ్డి సహా మరికొంత మంది పేర్లను అధికారులు గుర్తించారు. సోదాల అనంతరం ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావును అరెస్ట్ చేసి, రిమాండ్‌‌‌‌కు తరలించారు. బుధవారం (నేడు) ఉదయం ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు.