ఫోన్ కోసమే సోదాలు: విజయ్ మద్దూరి ఇంట్లో తనిఖీలపై ఏసీపీ కీలక ప్రకటన

ఫోన్ కోసమే సోదాలు: విజయ్ మద్దూరి ఇంట్లో తనిఖీలపై ఏసీపీ కీలక ప్రకటన

హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ కేసు నిందితుడు విజయ్ మద్దూరి ఇంట్లో సోదాలపై నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా విజయ్ మద్దూరు నివాసంలో ఏసీపీ రమణ గౌడ్ నేతృత్వంలో  ఇవాళ (అక్టోబర్ 29) మూడు గంటల పాటు సోదాలు చేశారు. అనంతరం తనిఖీలపై ఏసీపీ రమణ మాట్లాడారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసు దర్యాప్తులో భాగంగానే మంగళవారం విజయ్ మద్దూరి నివాసంలో సోదాలు నిర్వహించామని తెలిపారు. 

ముఖ్యంగా విజయ మద్దూరి మొబైల్ ఫోన్ కోసం తనిఖీలు చేశామన్నారు. ప్రస్తుతం విజయ మద్దూరి అందుబాటులో లేడని పేర్కొన్నారు. పోలీసుల మందు హాజరయ్యేందుకు హైకోర్టు రెండు రోజులు సమయం ఇచ్చిందని.. కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 

ALSO READ | జన్వాడ ఫామ్ హౌస్ కేస్: విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసుల సోదాలు

కాగా, జన్వాడలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన ఫామ్ హౌస్‎లో పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం సరఫరా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే రాజ్ పాకాల ఇంట్లో పార్టీకి హాజరైన విజయ మద్దూరికి పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. 

దీంతో జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ ఘటనపై వివిధ సెక్షన్ల కింద మోకిలా పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలను ఏ1, విజయ్ మద్దూరిని ఏ2గా పోలీసులు చేర్చారు. ఈ నేపథ్యంలో విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.