ఏసీలు పనిచేస్తలే..ఎమర్జెన్సీ సేవలు అందట్లే..

ఏసీలు పనిచేస్తలే..ఎమర్జెన్సీ సేవలు అందట్లే..
  • వరంగల్‌‌, కరీంనగర్‌‌ పెద్దాస్పత్రుల్లో తీవ్ర ఇబ్బందులు
  • ఎండ తీవ్రతకు తోడు, నిర్వహణలోపాల వల్లే సమస్యలు
  • ఆపరేషన్లు చేయలేక వాయిదా వేస్తున్న డాక్టర్లు
  • ఫ్రీజర్లు పనిచేయక కుళ్లిపోతున్న శవాలు
  • స్పందించని కాంట్రాక్ట్‌‌ సంస్థలు

వరంగల్‍, వెలుగు: ఓ వైపు ఎండలు, మరో వైపు నిర్వహణ లోపాల కారణంగా వరంగల్‍, కరీంనగర్‌‌ జిల్లాలోని పెద్దాస్పత్రుల్లో ఏసీలు, ఫ్రీజర్లు పనిచేయడం లేదు. దీం తో డాక్టర్లు, పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్‌‌ థియేటర్లలో ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోత మధ్య ఆపరేషన్లు చేయలేక ఎమర్జెన్సీ ఆప రేషన్లు తప్ప మిగతా అన్ని సర్జరీలను పోస్ట్‌‌పోన్‌‌ చేస్తున్నారు. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో డెడ్‌‌బాడీలు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఏసీలు, ఫ్రీజర్ల నిర్వహణ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌‌ సంస్థలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. 

నిలిచిపోతున్న ఎమర్జెన్సీ సేవలు

హైదరాబాద్‌‌ తర్వాత అతిపెద్ద నగరమైన గ్రేటర్‌‌ వరంగల్‌‌లో ఎంజీఎంతో పాటు కాకతీయ మెడికల్‌‌ కాలేజీ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌ నిర్మించారు. వరంగల్‌‌ చుట్టూ ఉన్న పది జిల్లాల ప్రజలు ఎమర్జెన్సీ టైంలో ఈ రెండు హాస్పిటల్స్‌‌కే వస్తుంటారు. బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో వరంగల్‌‌ సెంట్రల్‌‌ జైల్‌‌ ప్లేస్‌‌లో 24 అంతస్తులతో సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌ నిర్మించాలని నిర్ణయించారు. దీంతో ఎంజీఎం హాస్పిటల్‌‌ను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కేఎంసీ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌ అందుబాటులో ఉన్నా దాని నిర్వహణ మొత్తాన్ని గాలికి వదిలేశారు. దీంతో ఇక్కడ నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ హస్పిటల్‌‌లో 250 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రూ. కోట్లు ఖర్చు చేసి కార్డియాలజీ మొదలు న్యూరో సర్జరీ, పీడియాట్రిక్‌‌ సర్జరీ, యూరాలజీ, న్యూరాలజీ వంటి క్రిటికల్‌‌ ఆపరేషన్లకు సంబంధించిన పరికరాలు తెప్పించారు. గతంలో ఈ హాస్పిటల్‌‌లో బెడ్‌‌ దొరకడమే కష్టంగా ఉండేది. కానీ హాస్పిటల్‌‌లో వివిధ సమస్యల కారణంగా ప్రస్తుతం 70 నుంచి 80 మందికి మించి ఇన్‌‌పేషెంట్లు ఉండడం లేదు. ఈ హాస్పిటల్‌‌లో కొన్ని రోజులుగా ఆపరేషన్‌‌ థియేటర్లు, ఐసీయూల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో పేషెంట్లు, వారికి ట్రీట్‍మెంట్‌‌ చేయాల్సిన డాక్టర్లు పెరిగిన టెంపరేచర్లతో చుక్కలు చూస్తున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్లను ఎంజీఎంకు రెఫర్‌‌ చేస్తూ మిగిలిన వాటిని వాయిదా వేస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాకే పెద్ద దిక్కు అయిన గవర్నమెంట్‌‌ జనరల్‌‌ హాస్పిటల్‌‌లో సైతం ఐసీయూల్లో ఏసీలు పనిచేయడం లేదు. రెండు వార్డుల్లో ఆరు ఏసీలు ఉండగా కేవలం ఒక్కటే పనిచేస్తుండడంతో పేషెంట్లు ఎండ తీవ్రతతో నరకయాతన అనుభవిస్తున్నారు. తీవ్రమైన వడగాలుల కారణంగా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

పనిచేయని ఫ్రీజర్లు.. కుళ్లిపోతున్న డెడ్‌‌బాడీలు

ఉమ్మడి జిల్లాలో వరంగల్‌‌ ఎంజీఎంలోని మార్చురీనే పెద్దది. ఇందులో ఉన్న నాలుగు ఫ్రీజర్లలో 11 శవాలను దాచే కెపాసిటీ ఉంది. కానీ ప్రస్తుతం ఒకటి, రెండు ఫ్రీజర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ యాక్సిడెంట్‌‌ జరిగినా, ఇతర ఘటనల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా ఎంజీఎం మార్చురీకే తీసుకొస్తారు. ప్రతిరోజు ఇక్కడకు 7 నుంచి 10 డెడ్‌‌బాడీలు వస్తున్నాయి. వరంగల్‍, కాజీపేట రైల్వే స్టేషన్ల పరిధిలో సూసైడ్‌‌కు సంబంధించిన డెడ్‌‌బాడీలను సైతం ఇక్కడికే పంపిస్తుంటారు. వీటిని గుర్తించే వరకు ఫ్రీజర్లలో పెట్టాల్సి వస్తోంది. కానీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో డెడ్‌‌బాడీలు కుళ్లిపోతున్నాయి. దీంతో మార్చురీ ఏరియాతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దుర్వాసన కొడుతున్నాయి.

ఎక్స్‌‌రే కోసం రోజంతా పడిగాపులే..

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా మారిన వరంగల్‌‌ ఎంజీఎంలో ఎక్స్‌‌రే మెషీన్లు పనిచేయకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేడియాలజీ విభాగంలో ఆరు డిజిటల్‍ ఎక్స్‌‌రే, మరో మొబైల్‌‌ మెషీన్‌‌ ఉంది. సీజన్‌‌ ఆధారంగా ప్రతి రోజు 1,500 నుంచి 2,400 మధ్య ఓపీ ఉంటోంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ, ఇతరత్రా కలిపి నిత్యం 300 వరకు ఎక్స్‌‌రేలు తీయాల్సి వస్తోంది. మొత్తం ఆరు మెషీన్లలో కనీసం మూడు మెషీన్లు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. ఒక్కోసారి కేవలం ఒక మెషీనే పనిచేస్తోంది. దీంతో ఎక్స్‌‌రే కోసం వందలాది మంది పేషెంట్లు రోజంతా పడిగాపులు పడుతున్నారు.

కన్నెత్తి చూడని కాంట్రాక్ట్‌‌ సంస్థలు

వరంగల్‌‌ ఎంజీఎం, కేఎంసీ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌, కరీంనగర్‌‌ జనరల్‌‌ హాస్పిటల్‌‌లోని ఏసీలు, ఎక్స్‌‌రే మెషీన్లు, మార్చురీల్లో ఫ్రీజర్ల నిర్వహణను గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వారికి చెందిన కాంట్రాక్ట్‌‌ సంస్థకు కట్టబెట్టారు. ఏసీలు, మెషీన్లు ఏర్పాటు చేసిన నాటి నుంచి రెండు మూడేళ్ల పాటు నిర్వహణ చూసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్ట్‌‌ సంస్థలదే. కానీ ప్రభుత్వం మారడంతో కాంట్రాక్ట్‌‌ సంస్థలు స్పందించడం లేదు. వరంగల్‌‌ ఎంజీఎం మార్చురీని కొన్ని నెలల కింద రూ. 85 లక్షలతో డెవలప్‌‌ చేశారు. ఈ హాస్పిటల్‌‌లో ఫ్రీజర్ల ఏర్పాటును ఎస్‌‌కే సర్జికల్స్‌‌ అనే సంస్థకు అప్పగించారు. ఫ్రీజర్లకు ఏ రిపేర్‌‌ వచ్చినా ఈ సంస్థే అందించాల్సి ఉంది. కానీ తాము సమాచారం ఇచ్చినా కాంట్రాక్ట్‌‌ సంస్థ స్పందించడం లేదని ఎంజీఎం ఆర్‌‌ఎంవో అంబి శ్రీనివాస్‌‌ చెప్పారు. అలాగే కేఎంసీ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌లో ఏసీలు పనిచేయకపోవడంతో ఆపరేషన్లు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని, తప్పని పరిస్థితుల్లో ఎంజీఎంలోనే ఆపరేషన్లు చేస్తున్నట్లు నోడల్‍ ఆఫీసర్‌‌ అనిల్‌‌ బాలరాజు తెలిపారు. ఎంజీఎంలోనూ డిజిటల్‌‌ ఎక్స్‌‌రే మెషీన్లకు రిపేర్లు చేసేలా సంబంధిత సంస్థలతో మాట్లాడుతామని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్‌‌ హాస్పిటల్‌‌లోనూ ఏసీలు పనిచేయడం లేదన్న విషయం వాస్తవమేనని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సూపరింటెండెంట్‌‌ వీరారెడ్డి తెలిపారు. ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్‌‌ సంస్థలతో రిపేర్లు చేయించాలని, లేదంటే ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.