ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు మస్తు అమ్ముడుపోతున్నయ్​! గతేడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిన సేల్స్

ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు మస్తు అమ్ముడుపోతున్నయ్​! గతేడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిన సేల్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సిటీలో ఎండలు దంచి కొడుతుండడంతో రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఏసీలు కొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 20 నుంచి 30‌‌‌‌‌‌‌‌శాతం అమ్మకాలు పెరిగాయని షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. ఒక్కో షాప్ లో సగటున రోజుకు పది వరకు కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అమ్ముతున్నామని, వీకెండ్ లో వీటి సంఖ్య 20 వరకు ఉంటోందని వ్యాపారులు చెప్తున్నారు. 

ఈ లెక్కన మొత్తంగా గ్రేటర్​లో రోజుకు 10 వేలకుపైనే ఏసీలు అమ్ముడవుతున్నట్టు తెలుస్తోంది. డిమాండ్ అధికంగా ఉండడంతో డెలివరీకి కనీసం మూడు రోజుల టైం పడుతోందని, ఇన్​స్టాలేషన్​కు మరో రెండు రోజులు తీసుకుంటున్నామని అంటున్నారు. ఏసీలు రూ.30 వేల నుంచి రూ.65 వేలు ఆ పైనే.. కూలర్లు రూ.5 వేల నుంచి రూ.30వేల వరకు, రిఫ్రిజిరేటర్లు రూ.13 వేల నుంచి రూ.2 లక్షల ధర వరకు దొరుకుతున్నాయి. అయితే, కంపెనీ, వారంటీ, గ్యారంటీ, ఆఫర్లు, ధరల ఆధారంగా వినియోగదారులు కావాల్సిన వస్తువులను సెలెక్ట్​చేసుకుంటున్నారు. 

లేటెస్ట్ టెక్నాలజీ వైపు మొగ్గు..

రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లలో లేటెస్ట్​ టెక్నాలజీతో పని చేసేవాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వైఫైతో మొబైల్ కు కనెక్ట్ చేసుకుని కంట్రోల్​చేసే ఫెసిలిటీ ఉండడం, ఫైవ్​స్టార్​రేటింగ్​తో ఉండి కరెంట్​తక్కువ వాడుకునే వస్తువులను కొంటున్నారు. అలాగే, కన్వర్టేబుల్ ఫెసిలిటీ ఉన్న కూలర్లు ఎక్కువగా సేల్​అవుతున్నాయి. ఎండాకాలం కూలర్ వాడి, తర్వాత మడత పెట్టి పక్కన పెట్టే టెక్నాలజీ కావడంతో చాలామంది వీటినే తీసుకెళ్తున్నారు. ఏసీల్లో 1.5 టన్స్​ఎక్కువగా సేల్​అవుతున్నాయని షాపుల ఓనర్లు చెప్తున్నారు.  

వర్షం పడ్డా సేల్స్ తగ్గలేదు

కొద్ది రోజుల కింద వర్షం పడంది. సేల్స్ తగ్గుతై అనుకున్నం... కానీ వేడి తగ్గక ప్రిజ్ లు, కూలర్లు, ఏసీలు కొనేటోల్లు పెరుగుతున్నరు కానీ, తగ్గుతలేరు. 60 శాతం కస్టమర్లు డౌన్ పేమెంట్ ఈఎమ్ఐ లలోను, 30 శాతం మంది క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ లతోను, కేవలం 10 శాతం మంది క్యాష్ తోను కొంటున్నారు. లాస్టియర్ కంటే ఈ సారి సేల్స్ పెరిగింది. ఎండలు ఎక్కవ అయ్యే కొద్ది ఇంకా సేల్స్ పెరుగుతాయి. – అలందార్ హుస్సేన్, బజాజ్ సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్,
బంజారాహిల్స్ రోడ్ నం.1

ఈఎమ్ఐ పెట్టుకొని మంచి బ్రాండెడ్ కూలర్ కొన్న... 

ఈసారి ఎండలు ఎక్కువగాఉన్నాయి. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే మేలో ఇంకా దారుణంగా ఉండొచ్చు. వర్షం పడిందని అనుకుంటే వేడి మాత్రం తగ్గలేదు. వశపడక కూలర్ కొందామని వచ్చిన.. ఏసీల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకని నా బడ్జెట్ లో కూలర్ కొన్న. కూలర్ల రేట్లు తక్కునే ఉన్నయి. మళ్ల మళ్ల కొనేది కాదని ఈఎమ్ఐ పెట్టుకొని మంచి బ్రాండెడ్ కూలరే కొన్న. 
– గొల్ల యాదయ్య, ప్రైవేట్ ఉద్యోగి, లంగర్ హౌజ్