బీరుట్: ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమని, ఎంతమంది చనిపోయినా వెనకడుగు వేయబోమని ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ యాక్టింగ్ లీడర్ నైమ్ కసేమ్ ప్రతిజ్ఞ చేశాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్‌పై పోరాటం ఆపబోమని అన్నారు. హెజ్బొల్లా సంస్థ చీఫ్ నస్రల్లా మరణం తర్వా త తాత్కాలిక నాయకుడిగా నైమ్ కసేమ్ సోమవారం బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం తొలిసారి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌తో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. ఒకవేళ ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగితే దీటుగా ఎదుర్కొంటామని ప్రకటించాడు.
మా సామర్థ్యాలను దెబ్బతీయలేరు
తమ సంస్థకు చెందిన కీలక కమాండర్లను లక్ష్యంగా చేసుకొని, ఇజ్రాయెల్ దాడులకు దిగిందని, అయినాతమ సైనిక సామర్థ్యాలపై ప్రభావం చూపలేకపోయిందని నైమ్ కసేమ్ తెలిపాడు. ఒకవేళ కమాండర్లు గాయపడితే వారిస్థానాన్ని భర్తీ చేసేందుకు డిప్యూటీ కమాండర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. తమ ప్రాంతాలను రక్షించుకునేందుకు యుద్ధాన్ని కొనసాగిస్తామని, సుదీర్ఘకాల యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. కాగా, హెజ్బొల్లాకు చీఫ్‌ను ఎన్నుకునేవరకూ కసేమ్ యాక్టింగ్ లీడర్‌గా వ్యవహరించనున్నాడు.
బీరుట్ నగరంపై తొలిసారి బాంబుల వర్షం
యుద్ధం మొదలైన తర్వాత బీరుట్‌పై ఇజ్రాయెల్ తొలిసారి బాంబుల వర్షం కురిపించింది. నివాస సముదాయాలేలక్ష్యంగా సోమవారం ఎయిర్‌స్ట్రైక్ చేసింది. కోలా ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌పై అంతస్తుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) బాంబులు ప్రయోగించింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందారు. ఇందులో తమ సంస్థకు చెందిన ముగ్గురు లీడర్లు ఉన్నట్టు పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా(పీఎఫ్ఎల్పీ) మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. బీరుట్ తర్వాత బెకా ప్రాంతంపై ఇజ్రాయెల్ గురిపెట్టిందని కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన దాడుల్లో మొత్తం 105 మంది మరణించినట్టు లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. కాగా, దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ సోమవారం జరిపిన వైమానిక దాడిలో తమ కీలక నేత ఫతా షరీఫ్ అబూ అల్ అమీన్ చనిపోయినట్టు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రకటించింది.
నెతన్యాహుకు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులపై ఇరువురు చర్చించారు. ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు."పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలపై నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో టెర్రరిజానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయానికి భారత్ కట్టుబడి ఉంది" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.