
పరిగి, వెలుగు: పరిగి ప్రభుత్వాసుపత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్‌పై వికారాబాద్ జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకున్నారు. వారం రోజుల కిందట పరిగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సరైన ట్రీట్మెంట్ అందకపోవడంతో ఈ నెల 17న ‘ గాయపడి దవాఖానకు డాక్టర్లు లేరు’ శీర్షికతో వెలుగు పేపర్లో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన వికారాబాద్ జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు. పరిగి ప్రభుత్వాసుపత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ షాజియా ఫర్హానాను వికారాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే.
సిబ్బంది నిర్లక్ష్యంతోనే యమ్లీబాయి మృతి
తన తల్లి యమ్లీబాయి(58) మృతికి పరిగి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె కూతురు కవిత ఆరోపించింది. గురువారం బంధువులతో కలిసి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆమె ఆందోళన చేపట్టింది. ఈ నెల 16న పరిగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో దోమ మండలం పీర్లగుట్ట తండాకు చెందిన యమ్లీబాయి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను వికారాబాద్‌కు తరలించారు.
మార్గమధ్యలోనే యమ్లీబాయి చనిపోయింది. అయితే, పరిగి ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు లేక సిబ్బంది ట్రీట్ మెంట్ చేశారని.. వారి నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయిందంటూ యమ్లీబాయి కుమార్తె కవిత ఆరోపించింది. గురువారం ఆమె బంధువులతో కలిసి పరిగి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. పరిగి పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పి పంపించారు.