- త్వరలో జిల్లా స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేస్తాం: కలెక్టర్
- జడ్పీ మీటింగ్ లో అక్రమ వెంచర్లపై ప్రశ్నించిన సభ్యులు
- వివిధ సమస్యలపై నిలదీత
మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని ఇల్లీగల్ రియల్ ఎస్టేట్ వెంచర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఈ విషయమై త్వరలోనే జిల్లాస్థాయి మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు ఆయా మండలాల్లోని ఇల్లీగల్ వెంచర్లపై అధికారులను ప్రశ్నించారు. బెల్లంపల్లి మండలం కన్నాల శివారులో అక్రమ వెంచర్లు వెలిశాయని, కాసిపేట మండలం పెద్దనపల్లి, ఆకనపల్లి శివారులో కూడా అక్రమ వెంచర్లు చేస్తున్నారని వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ సభ దృష్టికి తీసుకొచ్చారు. కన్నాల శివారు తిరుమల హిల్స్ సమీపంలోని ఓ చెరువును సైతం రియల్టర్లు కబ్జా చేశారని ఆరోపించారు.
కనీసం నాలా పర్మిషన్లు కూడా లేకుండా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు గుంట చొప్పున అమ్ముతూ పేదలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. మండలంలో పదుల సంఖ్యలో ఇల్లీగల్ వెంచర్లు వెలిశాయని జైపూర్ జడ్పీటీసీ సునీత సైతం ఫిర్యాదు చేశారు. ఎలికంటిలో దళితుల రోడ్డు, ఫారెస్ట్ ల్యాండ్ ను రియల్టర్లు కబ్జా చేశారన్నారు. ఈ విషయమై పలుమార్లు డీపీఓకు, ఎంపీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫైర్అయ్యారు.
మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, లక్షెట్టిపేట, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, జైపూర్, కాసిపేట తదితర మండలాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటలేరువ్యవసాయ అధికారులు రైతు వేదికల్లో రైతులకు అందుబాటులో ఉండడం లేదని జన్నారం జడ్పీటీసీ ఎర్ర శేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్టికల్చర్ ఆఫీసర్లు మామిడి తోటలను సందర్శించడం లేదని, పూత రాలిపోతున్నా రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం లేదని నెన్నెల జడ్పీటీసీ సభ దృష్టికి తీసుకువచ్చారు.
బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ ను వెంటనే పూర్తి చేసి ఈ సీజన్లో కొనుగోళ్లు చేపట్టాలని వైస్ చైర్మన్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. నెన్నెల మండలంలోని మామిడి రైతులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సంక్షేమ గురుకులాల్లోని మిగులు సీట్లను అధికారులు అమ్ముకుంటున్నారని సత్తయ్య ఆరోపించారు.
ఆర్సీఓ స్వరూపరాణి అందుబాటులో ఉండడం లేదని, ఫోన్ కూడా ఆన్సర్ చేయరని అన్నారు. చెన్నూర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో సౌకర్యాలు లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారని కోఆప్షన్ సభ్యుడు అఙ్గార్ అలీ తెలిపారు. వీటితోపాటు పలువురు సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రొటోకాల్ పై నిరసన
ఉదయం 11.30 గంటలకు జడ్పీ మీటింగ్ ప్రారంభం కాగానే ప్రొటోకాల్ రగడ మొదలైంది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రొటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ సభ్యులు కింద బైఠాయించి నిరసన తెలిపారు. జడ్పీ మీటింగ్ కాపీలను అందించకపోవడంపై వైస్ చైర్మన్ సత్యనారాయణ నిలదీశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) బి.రాహుల్, జడ్పీ సీఈఓ గణపతి తదితరులు పాల్గొన్నారు.
గోనె సంచుల కొనుగోళ్లలో గోల్ మాల్
సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ద్వారా గోనె సంచుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య ఆరోపించారు. డీఎం గోపాల్‌ను సంచుల వివరాలు అడిగితే ఇవ్వకుండా దాచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఎంక్వయిరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లుల్లో వడ్లు లేకుండా సీఎంఆర్ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.
రైస్ మిల్లులను తనిఖీ చేసేందుకు కమిటీ వేయాలని కోరారు. సివిల్ సప్లై ఆఫీసర్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య అన్నారు. ఇంటర్మీడియట్ గోదాముల్లో రెండేండ్ల క్రితం నిల్వచేసిన వడ్లను మిల్లింగ్‌కు ఇవ్వకపోవడంతో ముక్కిపోయి ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. కోటపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి పెద్దపల్లి జిల్లాలోని మిల్లులకు కేటాయించిన వడ్లకు ట్యాగింగ్ చేయలేదని, కనీసం రసీదు కూడా ఇవ్వలేదని అధికారులను నిలదీశారు.