అజంజాహి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: మావోయిస్ట్ పార్టీ

అజంజాహి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: మావోయిస్ట్ పార్టీ

వరంగల్‍, వెలుగు: వరంగల్‌‌లోని అజంజాహి మిల్లు భూముల కబ్జాపై కొన్ని నెలలుగా వివాదం నడుస్తుండగా.. తాజాగా మావోయిస్ట్‌‌ పార్టీ పేరుతో విడుదలైన లెటర్‌‌ కలకలం సృష్టించింది. మావోయిస్ట్‌‌ పార్టీ జయశంకర్‍, మహబూబాబాద్‍, వరంగల్‍ (2), పెద్దపల్లి డివిజన్‌‌ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌‌ పేరుతో సోమవారం ఓ లేఖ బయటికొచ్చింది. ‘‘అజంజాహిలోని 451 మంది కార్మికులకు 2002లో బలవంతంగా వీఆర్‍ఎస్‍ ఇప్పించారని, కార్మికులకు చెందాల్సిన 226 ఎకరాల భూముల్లో 117.20 ఎకరాలను కాకతీయ అర్బన్‌‌ డెవలప్‍మెంట్‌‌ అథారిటీకి, 65 ఎకరాలు ఏపీ హౌజింగ్‌‌ బోర్డుకు, 30 ఎకరాలు రాంకీ, హ్యండ్లూమ్‌‌ కార్పొరేషన్‌‌కు అప్పటి కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అమ్మేసింది.

దీనిని నిరసిస్తూ ఉద్యమం చేపట్టిన కార్మికులు చందాలు వేసుకొని వెంకట్రామ థియేటర్‌‌ పక్కన 12 గుంటల భూమి కొని ఆఫీస్‍ నిర్మించుకున్నారు. అజంజాహి భూములపై ఓ వైపు న్యాయపోరాటం నడుస్తుండగా.. ఆ భూములను ఓ మాజీ ఎమ్మెల్యే సహకారంతో వ్యాపారి ఓంనమశ్శివాయ, గొట్టిముక్కుల నరేందర్‍ కబ్జా చేసే ప్రయత్నం చేశారు. లాయర్‌‌ చిక్కుడు ప్రభాకర్‍, నగరానికి చెందిన, అసంఘటిత కార్మిక సంఘం పేరుతో చలామణి అవుతున్న సుద్దాల నాగరాజు మొదట నమశ్శివాయకు వ్యతిరేకంగా పోరాటం చేసినా.. ఆ తర్వాత కార్మికుల ఆఫీస్‌‌ ఉన్న 12 గుంటల భూమి విషయంలో ఫేక్‌‌ డాక్యుమెంట్లు సృష్టించారు. 

సెటిల్‌‌మెంట్‌‌ పేరుతో ప్రభాకర్‌‌ ఆ భూమిని నమశ్శివాయకే అమ్మాడు. దీంతో ఏండ్ల తరబడి ఈ భూములను నమ్ముకున్న మిల్లు కార్మికులంతా రోడ్డున పడ్డారు. ఈ విషయంపై కేసు పెట్టేందుకు వెళ్తే పోలీసులు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భూ ఆక్రమణదారులకు, ఇందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. 12 గుంటల స్థలంలో కార్మికులకు భవనాన్ని నిర్మించి ఇవ్వాలి’’ అని లేఖలో  మావోయిస్ట్‌‌ కార్యదర్శి వెంకటేశ్‌‌ పేర్కొన్నారు.