రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలి

 రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలి
  • బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ 

న్యూ ఢిల్లీ, వెలుగు: తోటి సభ్యులపై దాడి చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కు కాంగ్రెస్ చేసిన అవమానాలను దేశం ముందుపెడితే.. తట్టుకోలేక ఆ పార్టీ నేతలు సంయమనం కోల్పోతున్నారని విమర్శించారు. నీచ రాజకీయాలను నిరసిస్తూ ఎన్డీఏ ఎంపీలంతా శాంతియుతంగా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేశామన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీ రఘునందర్ రావు మీడియాతో మాట్లాడారు.

లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకుని, తన పక్కనే దౌర్జన్యం చేసే వాళ్లను పెట్టుకున్నారని మండిపడ్డారు. రాహుల్ ను సభలోకి పోవద్దని తాము చెప్పలేదన్నారు. మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించారని చెప్పారు. ఓ మహిళా ఛాతీ పై చేతులు వేసి దాడి చేశారని ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ దాడికి తానే ప్రత్యక్ష సాక్షినని వెల్లడించారు. 

రాహుల్ వ్యవహార శైలిపై లోక్ సభ స్పీకర్, పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. దాడిలో ఎంపీ సారంగికి గాయాలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ గతంలో రెండు సార్లు అంబేద్కర్ ని ఓడించిందని గుర్తుచేశారు. ఓట్ల కోసమే అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారు తప్ప వారికి ఆయనపై నిజంగా అభిమానం లేదని రఘునందన్ రావు పేర్కొన్నారు.