- మండలిలో ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి
- ఉద్యమ కళాకారులకు జాబ్స్ ఇవ్వాలి: తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగులను ఉద్దేశించి ఓ ఉన్నతాధికారి చేసిన కామెంట్లు కరెక్ట్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం శాసన మండలిలో ఆయన మాట్లాడారు. స్పెషల్ మెన్లన్ లో భాగంగా ప్రస్తావించిన సమస్యలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నోట్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
దివ్యాంగుల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఆఫీసర్ పై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు తీసుకోవటం లేదో అర్థం కావటంలేదన్నారు. ఆ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వానికి ఎమ్మెల్సీలంతా నివేదిక ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. వైకల్యం అనేది జన్మతో వస్తుందని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి పుట్టుకతో వైకల్యం ఉన్నా కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఇంటర్మీడియెట్ బోర్డులో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. పెట్రోల్ ధరలు పెరిగినందున చార్జీలు పెంచాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారని.. ఈ అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మున్నూరు కాపు కార్పోరేషన్ కు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కూడా ఆనాడు ఉద్యమంలో భాగంగా పార్లమెంట్ లో ఎంతో పోరాడారని.. ఈ సందర్భంగా ఆయనకు మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు.