
- ప్రభుత్వ భూముల్లో ఆర్మూర్ మున్సిపల్ అధికారులు, బీఆర్‌ఎస్ నాయకుల అక్రమాలు
- అరికట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లిలో ప్రభుత్వ, ఇరిగేషన్ భూముల్లో ఇంటి నంబర్లు వేసి లక్షల రూపాయల అవినీతికి పాల్పడుతున్న ఆర్మూర్ మున్సిపల్ పాలకులు, బీఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్‌పాలకులు, బీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను ఖండిస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఆఫీస్‌ను రియల్ ఎస్టేట్ ఆఫీస్‌గా మార్చారని విమర్శించారు. చైర్‌పర్సన్ పండిత్ వినీత పవన్, పండిత్ ప్రేమ్, ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, కమిషనర్ ప్రసాద్ చౌహాన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏరియాలను బట్టి డబ్బులు వసూలు చేసి ఇంటి పర్మిషన్‌లు ఇచ్చి నలుగురు పంచుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ సీరియస్ గా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నలుగురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ బీసీ సెల్ జిల్లా ప్రెసిడెంట్యామాద్రి భాస్కర్, టౌన్ ప్రెసిడెంట్ ద్యాగ ఉదయ్ కుమార్, కౌన్సిలర్ సాయికుమార్, ఆకుల శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, నర్సారెడ్డి, ధన్ పాల్ శివ, గాండ్ల సాగర్, పాన్ శ్రీను, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.