దళితుల భూములు..కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : రేగుంట కేశవరావు మాదిగ

ఆసిఫాబాద్, వెలుగు : అమాయక దళితుల భూములను ఆక్రమించుకున్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బాధితులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడా, రణవెల్లి శివారులో శంకరయ్య, సూర్యాదాస్, కొండయ్య, సోమయ్య, ఋషి

విజయ్ కు చెందిన దాదాపు 40 ఎకరాల భూమిని కొందరు అక్రమంగా  పట్టాలు చేసుకున్నారని ఆరోపించారు. బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమించుకున్న పెత్తందారులు దళితులపై దౌర్జన్యానికి పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

అధికారులు, కబ్జాదారులు ఏకమై అక్రమంగా పట్టాలు చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు శంకర్, బాధితులు పాల్గొన్నారు.