గ్యారంటీలకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్, ఇతర నగరాలకు వలస వెళ్లిన అందరూ కూడా వారి సొంత గ్రామాలకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అయితే దరఖాస్తులో వివరాలను నమోదు చేసే క్రమంలో నిరక్షరాస్యులకు ఇబ్బంది ఎదురవుతోంది. వీరి లోపాన్ని అవకాశంగా చూసుకుని కొంతమంది దుకాణా యజమానులు, చదువుకున్నవారు ఒక్కో దరఖాస్తు ఫారాన్ని నింపడానికి డబ్బులు తీసుకుంటున్నారు. అర్హులైన ప్రజలు వారి అవసరం కోసం ఈ విధంగా మోసపోతున్నారు. కావున అప్లికేషన్ ఫారాలు తీసుకునే అధికారులు కూడా నిరక్షరాస్యుల దరఖాస్తు వివరాలను నమోదు చేయాలి. కొన్ని గ్రామాల్లో కొంతమంది జిరాక్స్ షాపుల నిర్వాహకులు డబ్బులకు దరఖాస్తులను విక్రయిస్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫారానికి అనవసర జిరాక్స్ జత చేయమని చెబుతూ ప్రజల చేత డబ్బులను వృథాగా ఖర్చు చేయిస్తున్నారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
- కె. శ్రావణ్, కొండాపూర్