ఆలయ భూముల కబ్జాపై చర్యలు తప్పవు

  • కబ్జాదారులతోపాటు అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికినివేదిక ఇస్తాం
  • ఆలయ పూజారి వీడియోపై స్పందించిన హైడ్రా కమిషనర్
  • తన బృందంతో కలిసి జగద్గిరిగుట్టలో పర్యటన

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్టలోని గోవిందరాజ స్వామి, శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ భూములతోపాటు ప్రభుత్వ భూములు పెద్దఎత్తున కబ్జాకు గురయ్యాయని ఆలయ పూజారి నరహరి తీసిన వీడియోపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. వీడియోను సోషల్ మీడియాలో చూసి శనివారం తన బృందంతో  కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత గోవిందరాజస్వామి వారిని దర్శించుకొని కబ్జాలను పరిశీలించారు. 

కులసంఘాల పేరుతో కొందరు, ప్రజాప్రతినిధుల అండదండలతో మరికొందరు భూములు ఆక్రమించి క్రయవిక్రయాలతో కోట్లాది రూపాయలు కూడబెట్టారని ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. పూజారి చెప్పిన గోవిందరాజస్వామి ఆలయ గుండంతోపాటు సుమారు 14 ఎకరాల ఆలయ భూములు , 66 ఎకరాల పరికి చెరువు సైతం కబ్జా అయ్యిందన్నారు. దీంతో ఆక్రమణలను గుర్తించి, కబ్జాదారులపై నాన్​బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని రంగనాథ్ హెచ్చరించారు. 

స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఇందుకోసం బుధవారం సమావేశం ఏర్పాటు చేసి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.హైడ్రా కమిషనర్ జగద్గిరిగుట్టలో పర్యటించడంతో స్థానిక ప్రజల్లో సంతోషం వ్యక్తం కాగా, కబ్జాదారులతోపాటు తెరవెనుక ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.