కాటారం, వెలుగు : ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై చర్యలు తప్పవని భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కాటారంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న ఆట స్థలాన్ని గురువారం సందర్శించారు. గ్రౌండ్ డెవలప్‌మెంట్ కోసం రూ. 30 లక్షలు మంజూరు అయినందున రూ. 10 లక్షలతో గ్రౌండ్ చుట్టూ ఇనుప కంచె వేయాలని సూచించారు.
మిగిలిన రూ. 20 లక్షలతో ప్రేక్షక్షులు కూర్చునేందుకు మెట్లు నిర్మించడంతో పాటు, పలు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. క్రీడా సామగ్రిని భద్రపరిచేందుకు ఓ బిల్డింగ్ నిర్మించడంతో పాటు, సోలార్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ స్థలాల ఏర్పాటు కోసం అంచనాను రూపొందించి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఉన్న ఖాళీ స్థలంలో పూలు, పండ్ల మొక్కలు నాటాలని చెప్పారు. కాటారంలో ఎర్రకుంట చెరువు శిఖానికి సంబంధించిన 5 ఎకరాల భూమిని చదును చేసి, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌వోసీ తీసుకొని సర్కార్ ఆఫీస్‌ల నిర్మాణానికి వినియోగించుకోవాలని సూచించారు. కాటారం మండలం మద్దులపల్లి శివారులో ఉన్న రెండున్నర ఎకరాల ఫారెస్ట్ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఎంఏసీ బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగించాలన్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. టెన్త్ రిజల్ట్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఆఫీసర్లు సాయిలు, అశోక్, ఎంపీపీ సమ్మయ్య, తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు.