- గడువు ముగిసి 20 రోజులవుతున్నా చర్యలు కరువు
- ఇంకా లక్షా 37 వేల ఎంటీఎస్ ల సీఎంఆర్ బకాయి
- జిల్లాలో మొండిగా వ్యవహరిస్తున్న 17 రైస్ మిల్లుల యజమానులు
నిర్మల్, వెలుగు: సీఎంఆర్ పెనాల్టీపై అధికారుల చర్యలు కనిపించడం లేదు. మొదట 25 శాతం పెనాల్టీతో కూడిన సీఎంఆర్ బియ్యాన్ని గత నెల 30వ తేదీలోగా ఇవ్వాలని సర్కార్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ గడువులోగా 17 రైస్ మిల్లులు సీఎంఆర్ బియ్యాన్ని సర్కార్ కు తిరిగివ్వలేదు. గడువు ముగిసి 20 రోజులు ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతరు
2022-–23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మొత్తం 11 వేల 191 ఎంటీఎస్‌ల బియ్యాన్ని 17 రైస్ మిల్లుల యజమానులు సర్కారుకు ఇవ్వాల్సి ఉంది. 2023–24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 38 వేల764 ఎంటీఎస్‌లు, రబీ సీజన్‌కు సంబంధించి 94 వేల 419 మెట్రిక్ టన్నులు కలిపి దాదాపు 1 లక్షా 37 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది.
కానీ రాజకీయ పలుకుబడి, పరపతితో రైస్ మిల్లుల యజమానులు సర్కారు హెచ్చరికలను బేఖాతరు చేస్తూనే ఉన్నారు. రికవరీ విషయంలో సంబంధిత శాఖ అధికారులు నామమాత్రంగానే ఉంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం మిల్లుల యాజమానులకు వరంగా మారుతోంది. పర్యవేక్షణ లోపం, కొన్ని క్షేత్రస్థాయి కారణాల వల్ల రైస్ మిల్లు యజమానులు సీజన్‌కు అనుగుణంగా సీఎంఆర్ బియ్యాన్ని సర్కారుకు ఇవ్వకుండా దాటవేత వైఖరి అవలంభిస్తూ ధాన్యాన్ని రొటేషన్ చేస్తూ పక్కదారి పట్టిస్తున్నాయని ఫిర్యాదులున్నాయి.
సీఎంఆర్ క్లియర్ ఉన్న మిల్లులకే ప్రస్తుతం ధాన్యం
ఇప్పటివరకు 100 శాతం సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి చెల్లించిన రైస్ మిల్లులకే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యాన్ని కేటాయించనున్నారు. ఈ మేరకు అధికారులు స్పష్టమైన ప్రకటన జారీ చేయడం కొంతమంది బకాయిలున్న రైస్ మిల్లర్లకు మింగుడు పడడం లేదు. నిర్మల్ జిల్లాలో మొత్తం 75 రైస్ మిల్లులు ఉండగా.. వీటిలో 15 బాయిల్డ్ మిల్లులు, మరో 60 రా రైస్ మిల్లులున్నాయి. సీఎంఆర్ తిరిగివ్వని 17 రైస్ మిల్లులకు బకాయిలపై 25 శాతం పెనాల్టీ విధించారు. కొన్ని రైస్ మిల్లులు కూడా నవంబర్ 30 వరకు సీఎంఆర్ బకాయి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సీఎంఆర్ కోసం ఈ రైస్ మిల్లులకు మినహాయింపునిచ్చే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
వేర్వేరు మిల్లులకు ధాన్యం
సీఎంఆర్‌కు సంబంధించి ధాన్యం మిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇందులో భాగంగానే సన్న బియ్యం, దొడ్డు బియ్యం మిల్లింగ్‌కు రైస్ మిల్లులను గుర్తించాం. బియ్యాన్ని వేర్వేరు మిల్లులకు తరలిస్తున్నాం. సీఎంఆర్ బకాయిలపై ప్రభుత్వం నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.కిషోర్ కుమార్, అడిషనల్ కలెక్టర్, నిర్మల్ జిల్లా