గ్రామకంఠం భూములకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు

  • పైలట్ ప్రాజెక్ట్ గా అంగడి కిష్టాపూర్, యావపూర్​లోసర్వే కంప్లీట్​
  •  త్వరలో సీఎం కేసీఆర్​కు నివేదిక.. అమలు
  • రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు

గజ్వేల్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామకంఠం భూములకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగడి కిష్టాపూర్ గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ గా సర్వే చేసినట్టు చెప్పారు.  వ్యవసాయ భూములకులాగే ఇండ్లకు, ఖాళీ స్థలాలకు కూడా పట్టాలు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మెదక్ జిల్లా యావపూర్, సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెండు నెలలుగా గ్రామంలో అధికారుల బృందం సర్వే చేసి గ్రామకంఠం భూముల హద్దులను గుర్తించినట్లు తెలిపారు. 341 కుటుంబాలకు భూములను సర్వే చేసి అంతా సిద్ధం చేశామన్నారు. ఈ సర్వే నివేదికను సీఎం కేసీఆర్ కు సమర్పించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వెంటనే అంగడికిష్టాపూర్ లోని గ్రామకంఠం భూములకు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠం భూములకు పట్టాలు ఇవ్వడానికి చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,  గ్రామ సర్పంచ్ దుద్దెడ లక్ష్మి, ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గడా స్పెషల్ ఆఫీసర్ ముత్యం రెడ్డి పాల్గొన్నారు.